ఇండియా.. ఒలింపిక్స్ లో కొత్త రికార్డు సృష్టిస్తుందా?

అంతన్నారు… ఇంతన్నారు.. ఆటగాళ్లను నిందించే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు కానీ, రియోలో కనీసం భారత్ కు ఒక్క పతకం అయినా వస్తుందా? లేక చాలా దశాబ్దాల తర్వాత కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే వెనుదిరిగి.. ఇన్నేళ్లలో భారత్ కు కూడా సాధ్యం కాని రికార్డును టీమిండియానే స్థాపించబోతోందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇంత వరకూ ఖాతా తెరవలేదు. పతకం మీద భారీ ఆశలను మోసిన ఆటగాళ్లు, అథ్లెట్లు.. చాలా మంది ఇప్పటికే పోరాటాన్ని ముగించారు.
 
అంచనాలు ఉన్న వారు.. పతకాన్ని ఖాయం చేస్తారనుకున్న వాళ్లు.. ఫెయిల్యూర్స్ ను కొనసాగిస్తుండటం చూస్తుంటే.. ఒలింపిక్స్ లో పతకం  అనుమానంగా మారుతోంది. హాకీలో లీగ్  రౌండ్ ను దాటి నాకౌట్ కు చేరారనుకుంటే.. క్వార్ట్రర్స్్ లో చిత్తుగా ఓడిపోయారు. చాలా దశాబ్దాల తర్వాత హాకీలు ఆశలు పుట్టింది ఈ సారే. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత టీమిండియా హాకీలో నాకౌట్ రౌండ్ కు చేరడమే ఈ సారికి ఘనత. బెల్జియం చేతిలో ఇండియా చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

ఇక సానియా, బోపన్న ద్వయం సెమిస్ కు ఎంట్రీ ఇచ్చి ఉన్నట్టుండి ఆశలను పైపైకి తీసుకెళ్లింది కానీ.. సెమిస్ లో ఓటమి పాలుకావడంతో పాటు, కాంస్య పోరులోనూ ఓటమి చెందడంతో.. ఇక్కడ కూడా ఆశలకు తెర పడింది. ఈ బాధలోనూ.. మరింత బాధ ఏమిటంటే.. సైనా ఓటమి. పతకం ఖాయంగా తెస్తుందని అనుకున్న సైనా కూడా ఓడిపోవడంతో ఇక ఖాతా తెరిచే బాధ్యతను ఎవరు తీసుకొంటురనేది ప్రశ్నగా నే మిగిలింది.

దీపికా కర్మకర్, ప్రతిసారీ ఒక్క పతకాన్ని అయిన ఇచ్చిన షూటర్లు.. ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ భారత అథ్లెట్లు పూర్తి గా నిరాశ పరిచారు. ఒకరిద్దరు బాక్సర్లు, షటిలర్లు  నాకౌట్ దశలో పోటీలో ఉన్నారు కానీ.. ఇప్పటి వరకూ మనోళ్ల ప్రదర్శనను చూస్తే.. ఒక పతకం మీద ఆశలు పెట్టుకోవడం అంటే అది సాహసమే. ఎవరైనా అనూహ్యంగా సాధిస్తే అప్పుడు  ఆనందించాలంతే!

Readmore!
Show comments