వెంకయ్య కురచ బుద్ధి ఆ డైలాగులో తేలిపోతోంది!

అర్ధరాత్రివేళ అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను దారుణంగా వంచించిన తర్వాత.. వెంకయ్యనాయుడు వంతు వచ్చింది. ఆయన సింపుల్‌గా ఒక్క డైలాగుతో.. తన కురచబుద్ధిని బయటపెట్టుకున్నారు. ఆ బుద్ధి అచ్చంగా ఆయన సొంతం కాకపోవచ్చు. కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ మరియు దాని సారధి నరేంద్రమోదీ ల కురచ బుద్ధిని ఆయన బయటపెట్టారు. సదరు కురచబుద్ధులకు తాను ప్రతినిధిగా వ్యవహరించాల్సి రావడం ఎంతో సీనియర్‌ మరియు అనుభవజ్ఞుడు అయిన వెంకయ్యనాయుడుకు పట్టిన ఖర్మ అనుకోవాలి. 

మిగిలిన రాష్ట్రాలతో సమాన హోదాను సాధించే వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర సాయం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలి... అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ డైలాగులోనే ఆయన కొద్దిబుద్ధులు తెలిసిపోతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. అక్కడ అభివృద్ధిలో వారి స్వతంత్ర ప్రతిపత్తి పెరుగుతుంది. పరిశ్రమలు నేరుగా అక్కడకు వెల్లువెత్తుతాయి. అడుగడుగుకూ కేంద్రం ముందు మోకరిల్లి దేబిరించే పరిస్థితి ఉండదు. అందుకే హోదా కాకుండా ప్యాకేజీ రూపంలో ఇస్తే.. ఆంధ్రప్రదేశ్‌ లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. కేంద్రం ముందు సాగిలపడుతూ ఉండాలన్నమాట. ఇది వారిలోని అహంకారానికి నిదర్శనం. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు వైఖరి కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నది. 

ప్యాకేజీ అంటే ఎప్పటికప్పుడు రాష్ట్రానికి ఇస్తూ ఉంటారు. ప్రతిసారీ రాష్ట్రాలు అడుక్కుంటూ ఉండాలి. కేంద్రాన్ని ధిక్కరించి రాష్ట్రం ఒక్క మాట కూడా మాట్లాడ్డానికి వీలుండదు. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్‌ వ్యవస్థనేనా.. నరేంద్ర మోదీ తాను ఉద్ధరించేస్తానంటూ.. ప్రధాని పదవిని అధిష్టించింది. 

నిరంకుశంగా రాజరికపు పెత్తందారీ భూస్వామ్య పోకడలతో వెంకయ్యనాయుడు గానీ, లేదా ఆయన ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ మోదీ గానీ .. దేశ ప్రజలను వంచిస్తున్నారంటే అతిశయోక్తికాదు. దేశమంటే గుజరాత్‌ ఒక్కటే కాదని.. మొత్తం అన్ని రాష్ట్రాలకు తాను జవాబుదారీతనం వహించాలని మోదీ తెలుసుకోవాలి. కాబట్టి.. అన్ని రాష్ట్రాలతో సమానం అయ్యేవరకు సాయం అందిస్తూనే ఉంటాం.. వంటి పడికట్టు డైలాగులు చెబితే తన పరువు పోతుందని వెంకయ్యనాయుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. 

Show comments