జైరాం మాటలు సోనియా పెత్తనానికి ఎదురుదెబ్బే!

కాంగ్రెస్‌ పార్టీ అంటే.. తమది వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు.. అదే సమయంలో కిట్టనివారు, ప్రజలు మాత్రం.. వ్యక్తిపూజకు పరిమితమైన సోనియా కుటుంబ భజనకు మాత్రమే అలవాటు పడిపోయిన పార్టీ అని ఈసడిస్తారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించినంతవరకు ప్రజల్లో ఎలాంటి ఇమేజి లేకపోయినా సరే.. సోనియా భజన చేస్తూ.. మేడం గుడ్‌ లుక్స్‌లో ఉండగలిగితే చాలు.. నాయకుడిగా చెలామణీ అయిపోవచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజానికి ఆ పార్టీ సాంప్రదాయమే అది. 

అయితే ప్రస్తుతం ఆ పార్టీ యొక్క నవతరం వ్యూహకర్తల్లో ఒకరు, రాహుల్‌ కోటరీలోని కీలక వ్యక్తుల్లో ఒకరు అని గుర్తింపు ఉన్నర జైరాం రమేష్‌ తాజాగా కొన్ని గమనించదగిన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో 'మరో రెండు వారాల్లో రాహుల్‌ గాంధీకాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు' అంటూ ప్రచారం చేసుకుంటూ మనుగడ సాగిస్తున్న జైరాం రమేష్‌.. అదే స్వామి భక్తిని ప్రియాంక పట్ల చూపించలేకపోతున్నట్లుంది. 

ప్రియాంక ఒక్కరే కాంగ్రెస్‌ను పునరుద్ధరించలేరు అని జైరాం మీడియాతో పేర్కొనడం విశేషం. కాంగ్రెస్‌ పతనమైంది అని ఆమోదిస్తున్నట్లున్న ఈ వ్యాఖ్యల్లో భాగంగానే ఏ ఒక్కరి చేతిలోనూ మంత్రదండం లేదని, కాంగ్రెసు పార్టీ అనే సమష్టి సంస్థ వద్దనే మంత్రదండం ఉందని వ్యాఖ్యానించారు. ఒక్కరే పార్టీని ఉద్ధరించే పరిస్థితి పోయిందంటున్న జైరాం రమేష్‌ వ్యాఖ్యలు సోనియా కుటుంబానికి బహుశా కంటగింపు కావొచ్చు. 

అయితే రాహుల్‌ కోటరీకిచెందిన జైరాం రమేష్‌, ప్రియాంక లేకుండా యూపీ ఎన్నికల్లో దెబ్బలు తప్పవేమో అని అర్థం వచ్చేలా మీడియా ప్రశ్నలు సంధించినప్పుడే ఇలాంటి రెచ్చిపోయిన వ్యాఖ్యలు చేశారనే వాదన ఉంది. ఏదేమైనప్పటికీ, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పతనం కావడం మాత్రమే కాదు, పార్టీలో సోనియా కుటుంబ గుత్తాధిపత్యం కూడా పతనదిశగానే ఉన్నదని స్పష్టమవుతోంది. 

Show comments