చిన్నాన్నకు జగన్‌ క్లారిటీ ఇవ్వడం లేదు!

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగంలోకి దిగినట్టుగానే వ్యవహరిస్తున్నాడు వైఎస్‌ వివేకానందరెడ్డి. ఇప్పటికే జిల్లాలో కూర్చుని ఆయన ఒక్కో మండలానికీ వెళ్లి.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుపోతున్నాడు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి.. పార్టీ ఓట్లను గుర్తించి, వారి ఓటును వేయాలని సూచిస్తూ, ఆదేశిస్తూ.. వైఎస్‌ వివేక ముందుకుపోతున్నాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా వివేక వెంట కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము గెలిచి తీరతామని ఇప్పటికే సీఎం రమేశ్‌ సవాల్‌ విసిరాడు. 

ఎలాగూ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఓట్లతో జరిగే ఎన్నికలు కాబట్టి.. ఈ ఎన్నికల్లో ధనబలం గట్టి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వాస్తవంగా ఓట్ల లెక్క ప్రకారం వైకాపాకే బలం ఉన్నా, వాళ్లంతా వైకాపాకే ఓటు వేస్తారని లేదు. మేయర్‌, చైర్మన్‌ల ఎన్నికల సమయంలోనే ఇలాంటి వాళ్లు డబ్బుకు అమ్ముడుపోయి అవతల పార్టీకి ఓటు వేయడం రొటీన్‌గా జరుగుతూ ఉంటుంది.  మరి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎంపీటీసీలు ఆయా పార్టీలపై విధేయతను చాటుకుంటారనే నమ్మకం ఏమీలేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ గెలిచి.. ఇదే ప్రజా తీర్పు అని, జగన్‌ను ప్రజలు తిరస్కరించారని ప్రకటించాలని ఉబలాటపడుతోంది. 

కడపలో జగన్‌ పార్టీని ఓడించాం.. అని చెప్పుకోవడానికి అయినా కోట్ల రూపాయలు ఎర వేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని చూస్తే.. రాజకీయ పార్టీలు సొంత వాళ్లను, బయటి వాళ్లను కొనేయడానికి ఒక్క స్థానం కోసమే వందకోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కడపజిల్లా ఎమ్మెల్సీ సీటు కూడా అదే కేటగిరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. 

మరి ఇంత రాజకీయ వేడి ఉందనుకుంటే.. వైకాపా తరపున అభ్యర్థి ఇంకా ఖరారు కావడం లేదు. ఒకవైపు వివేకానందరెడ్డి ఏమో.. జిల్లాలో తిరుగుతున్నాడు కానీ, పార్టీ తరపున ఆయనే అభ్యర్థి అనే అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు! ఈ విషయంలో జగన్‌ ఏమనుకుంటున్నాడో వైకాపా శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. తెలుగుదేశం పరిస్థితి కూడా అటు ఇటుగా ఇలానే ఉంది. ఆ పార్టీ తరపున చాలా మంది టికెట్‌ కోసం పోటీలు పడుతున్నారు. 

Show comments