'రెండు కళ్లు' అనగానే నేత్రవైద్యులు కాకుండా చంద్రబాబు గుర్తుకు వస్తున్నారు జనాలకు. గతంలో 'వెన్నుపోటు' అనగానే ఎముకల వైద్యుడికి బదులు ఆయనే గుర్తుకు వచ్చేవారు. 'ఆంధ్ర, తెలంగాణ రెండూ నాకు రెండు కళ్లు' అన్న దగ్గర్నుంచి యిక దానిపై విమర్శలు, వెక్కిరింతలు అన్నీ పుట్టుకుని వచ్చాయి. చివరకు అది రెండు పడవల ప్రయాణంలా తయారైంది. సినీరచయిత జనార్దన మహర్షి ''వెన్నముద్దలు'' అని అద్భుతమైన కవితా సంకలనాన్ని వెలువరించారు. దానిలోని ఒక కవితలో ప్రాపంచిక నిత్యసత్యాన్ని అతి చమత్కారంగా చెప్పారు. 'మా అమ్మ, మా ఆవిడ, నా రెండు కళ్లు,.. కళ్లు - ఒకదానినొకటి చూసుకోవు' అని! చంద్రబాబుగారు రెండు కళ్లుగా చెప్పుకున్న ఆంధ్ర, తెలంగాణ యిప్పుడు ఒకదాన్ని ఒకటి చూసుకోవటం లేదు. బద్ధశత్రువుల్లా తయారయ్యాయి. రెండూ కావాలనుకున్నవారికి పెద్ద చిక్కొచ్చిపడింది. ప్రస్తుతం చంద్రబాబుగారికి రాష్ట్రం, కేంద్రం రెండు కళ్లుగా తయారయ్యాయి. ఆ ఉపమానం యిప్పుడాయన ఉపయోగించడం లేదు కానీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మరి యీ రెండు కళ్లూ కూడా ఒకదాన్ని మరొకటి చూసుకోవటం లేదు. అరుణ్ జేట్లీ మాటలు విన్నా, యితర నాయకులు పదేపదే కుండబద్దలు కొట్టి హోదాగీదా లేదని చెపుతున్న మాటలు చెవిన పడినా, కేంద్రం ఆంధ్రపై పగబట్టిందని, అందువలన ఆంధ్ర కేంద్రంపై అలిగిందనీ చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతోంది. కానీ తనకు మాత్రం అర్థం కాలేదని బాబు నటించవలసి వస్తోంది. కొడుకు చేసిన తప్పులకు అమ్మ బాధపడుతుంది, కానీ పక్కింటివాళ్లు ఫిర్యాదు చేసినా, భర్త దండించబోయినా పిల్లవాణ్ని వెనకేసుకుని వస్తుంది. ఈ ద్విపాత్రాభినయం చాలా కష్టం. అభినయం చేయాలి, కానీ చేసినట్లు కనపడకూడదు, అదీ అసలు చిక్కు.
బాబును మధ్యరాత్రి నిద్రలో లేపి 'ప్రత్యేక హోదా వలన లాభమా? నష్టమా?' అని అదాటున అడిగితే ఏం జవాబు చెప్తారా అని ఆలోచిస్తూ వుంటాను. ఎందుకంటే మెలకువగా వున్నపుడు యీ ప్రశ్నకు ఆయన రకరకాలుగా సమాధానాలు చెప్తూ వచ్చారు. ఆయన మనసులో ఏముందో తెలియకుండా పోయింది. 'విభజన వలన అన్యాయం జరిగిన ఆంధ్రను ఆదుకునే ఏకైక కల్పవృక్షం ప్రత్యేక హోదా! దాన్ని సంపాదించి పెట్టినది బిజెపియే! కాంగ్రెసు ఆ వూసు లేకుండా లోకసభలో బిల్లు పాస్ చేయించుకున్నా, రాజ్యసభలో మోకాలు అడ్డుపెట్టి బిజెపి యీ వరాన్ని తెచ్చింది. పదేళ్లు అడిగితే దుష్ట కాంగ్రెసు ముష్టి ఐదేళ్లు యిచ్చింది. 'మేం ఎలాగూ అధికారంలోకి వస్తాం, పదేళ్లిస్తాం' అంటోంది బిజెపి. బిజెపితో జట్టుకట్టి పదిహేనేళ్లు సాధిస్తాం. అసలు మేం జట్టు కట్టేది, రాష్ట్రాభివృద్ధి కోసమే. ఆ హోదా రాగానే కొత్త పరిశ్రమలు ఆంధ్రను ముంచెత్తుతాయి. ఓ పక్క హోదా కారణంగా పన్ను రాయితీలు, మరో పక్క బాబు వంటి చురుకైన, సమర్థుడైన ముఖ్యమంత్రి. పెట్టుబడుల కుండపోత ఆపలేం. అప్పుడే తమిళనాడు కుళ్లుకోవడం మొదలుపెట్టింది. తెలంగాణ భయంతో వణికిపోతోంది.' అంటూ టిడిపి ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంది. అధికాంశం ప్రజలు నమ్మారు. అధికారాన్ని అప్పగించారు.
అ తర్వాత కొద్ది రోజులకే అందరికీ అర్థమయిపోయింది - ప్రత్యేక హోదా యిచ్చేందుకు మోదీ సుముఖంగా లేరని. బాబుకి యీ సమాచారం ముందే తెలిసి వుంటుంది. బయటపెడితే రాష్ట్రప్రజలు కేంద్రంపై భగ్గుమంటారు. తనకు రెండూ కావాలి. అందువలన చెరో పడవలో తలో కాలు పెట్టి, రెండు పడవల ప్రయాణం మొదలుపెట్టారు. ఓ పడవలో 'హోదా వచ్చేస్తోంది, మనకిస్తే మిగతావాళ్లు ఏడ్చిపోతారని ఆలోచిస్తున్నారంతే' అనే బ్యానర్ కట్టారు. ఆ పడవ నడిపే భారం సుజనా చౌదరి, కంభంపాటి వగైరాలకు అప్పగించారు. మరో పడవలో 'హోదా వస్తే ఎంత, రాకపోతే ఎంత? దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటే లాభం' అనే బ్యానర్ కట్టారు. దీని స్టీరింగు రాష్ట్ర టిడిపి నాయకులకు అప్పగించారు. హోదా వలన ఒనగూడే వాటి కంటె మెరుగైన ప్రయోజనాలతో ప్యాకేజీ ఎలా యిద్దామాని కేంద్ర బిజెపి నాయకులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారనీ, కేంద్రంలో వున్న టిడిపి నాయకులు వారికి ఆ పనిలో సాయపడుతున్నారనీ చెప్పసాగారు. ప్యాకేజీ మాట ఎలా వున్న హోదా వస్తుందా, రాదా అది చెప్పండి అని జనాలు ఎన్నిసార్లు అడిగితే అన్ని వేర్వేరు సమాధానాలు వచ్చాయి. ఇవ్వకపోతే ఊరుకోమని..., ఇస్తారనే ఆశ వుందనీ...., ఇస్తే మంచిదేననీ.., ఇచ్చినంత మాత్రాన సంజీవని కాదని..., ఇస్తే కాదనమనీ.... - యిలా స్థిరత్వం లేకుండా తమకేం కావాలో మనకు తెలియనీకుండా కాలక్షేపం చేశారు. మన్‌మోహన్ రాజ్యసభలో ప్రకటన చేసి, కాబినెట్ తీర్మానంలో పెట్టినదాన్ని గట్టిగా అడగరేం? అని నిలదీస్తే '...బిల్లులో పెట్టలేదు కాబట్టి' అంటున్నారు. బిల్లులో పెట్టేసి వుంటే ప్రత్యేక హోదా ఎన్నికలలో అంశమే అయ్యేది కాదు, మీకు దానివలన లబ్ధి చేకూరేదే కాదు. చట్టరూపం ధరించకుండా అస్పష్టంగా వున్నదాన్ని నయానో, భయాన్నో అడిగి తేగల సమర్థులు కదాని మీకు ఓట్లు వేశారు. కాంగ్రెస్సే పెట్టి వుంటే.. అని మీరు యివాళ చెపితే ఆయనే వుంటే... సామెత గుర్తుకు వస్తుంది. పెట్టక కాంగ్రెసు ఎన్నికలలో చావుదెబ్బ తిన్న విషయమైనా మీరు గుర్తు పెట్టుకోవాలి కదా.
హోదా గురించి ప్రతిపక్షాలు అడిగినప్పుడల్లా బాబు ప్యాకేజీ గురించి మాట్లాడతారు. తెనాలి రామకృష్ణుడి ముందు కాళికా దేవి రెండు ముంతలు పెట్టి 'పాలా పెరుగా ఏదో ఒకటే తీసుకో' అందిట. అలా మోదీ బాబు ముందు ముంతలేవైనా పెట్టారా? వాటిలో వున్నవి పాలూ, పెరుగేనా? మరేవైనానా? అలాటిది జరిగితే ఆ ముక్క జనాలకు చెప్పేస్తే దేనిలో ఏముందో ఓ సారి చూసుకుని ఎంచుకుంటారు. అదే అడగవచ్చు. ఆ ప్యాకేజీ అనే బ్రహ్మపదార్థాన్ని ఎప్పటికీ విప్పిచెప్పరు. చేతికివ్వరు. రెండేళ్లు దాటింది, యిప్పటికీ యివ్వరేం? అంటే హోదా అడిగాంగా, అందుకని ఆలస్యమవుతోంది అంటారు. పోనీ ఆ హోదాయైనా దయచేయించండి అంటే 'హోదా అనుభవించిన రాష్ట్రాలు ఏం బావుకున్నాయి?' అని బాబు గద్దిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో మన తెలుగువాళ్లే బోల్డు పవర్ ప్లాంట్లు పెట్టారు. హోదా వలన రాయితీలు వస్తాయని కాకపోతే అంత దూరం వెళ్లేవారా? హోదా వలన నష్టమే తప్ప లాభమే లేదని తెలిసినపుడు బిజెపి, టిడిపి అంధ్ర రాష్ట్రానికి అది కావాలని ఎందుకు పట్టుబట్టినట్లు? పదేళ్లు, పదిహేనేళ్లు పాటు వుండేలా సాధిస్తామని ప్రజల కెందుకు చెప్పినట్లు? అనాథలుగా మిగిలిన ఆంధ్రులను మరింత బికారులు చేద్దామనా? హోదా పొందిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని తాను చెప్తున్నది అబద్ధమని బాబుకి తెలియకుండా వుండదు. గణాంకాలే చెప్తాయి. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు, కేంద్రం హోదా యివ్వలేదు కాబట్టి యిచ్చినా వేస్టు అంటున్నారు. ఇచ్చి వుంటే 'నేనే తెచ్చి ఆంధ్రను బతికించాను, మరెవరి వలన అయ్యేది కాదు' అని చెప్పుకునేవారు.
ఆంధ్ర నుంచి కాంగ్రెసు ఎంపీలు పుష్కలంగా వున్నంత కాలం వీళ్లంతా దండగ, కేంద్రం నుంచి ఏమీ తేలేకపోయారు, దద్దమ్మలు దొరికారు మనకు అంటూండేవారు బాబు. ఇప్పుడు వారి స్థానంలో టిడిపి వారు వచ్చారు. వీళ్లూ ఏమీ తేవటం లేదు. వీరి నేమంటారో మరి! నిధుల విషయంలో కేంద్రం నాటకాలు ఆడుతోంది. 14 వ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది కాబట్టి హోదా లేదంటుంది, యిప్పటికే మీకు చాలా యిచ్చామంటుంది, శంకుస్థాపన రాళ్లు వేసిన ప్రాజెక్టులను చూపించి లక్షలు లక్షలు కుమ్మరించామంటుంది. బజెట్‌లో కేటాయింపులు లేవు, నిధులు పంపలేదు, పంపలేదేం అంటే మీకు మేం వేసిన క్వెరీలకు సమాధానాలు యివ్వలేదంటుంది, డిపిఆర్‌లు లేవంటుంది, నిధులు మళ్లించారంటుంది. వాళ్లు యిచ్చిన నిధులేవైనా వుంటే అవి తక్కిన రాష్ట్రాలతో సమానంగా న్యాయప్రకారం రావలసినవే తప్ప, దెబ్బ తిన్న రాష్ట్రం కదాని విడిగా చేతిలో పెట్టినదేమీ లేదు. ఈ మాటను బాబు ఓ సారి చెప్తారు, మరోసారి కేంద్రం ఆదుకుంటోంది అంటారు. అయినా నాకు తృప్తి లేదు అంటూ ముక్తాయింపు యిస్తారు. కేంద్రం యిచ్చిన నిధులపై శ్వేతపత్రం రిలీజు చేయండని ప్రతిపక్షాలు అడిగితే కిమ్మనరు. కేంద్రాన్ని వెనకేసుకుని రావడం ఎంతవరకూ వచ్చిందంటే అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోదీ వస్తే సభాముఖంగా ఆయన్ని అడగలేనంత మొహమాటం! అదేమంటే మర్చిపోయా అన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కలవరిస్తున్నా, పలవరిస్తున్నా అనే వ్యక్తి మర్చిపోయేటంత చిన్న అంశమా అది? ఒకవేళ ఒరిజినల్ స్పీచ్‌లో వుండి వుంటే ఏ పిఏ నో గుర్తు చేసి వుండేవారు.
బాబు బిజెపిని ఏమీ అనరు, అననివ్వరు. ఒకవేళ ఏదైనా అనాల్సి వస్తే, కాంగ్రెసును పది అని, చివర్లో బిజెపిని ఒకటి మెత్తగా అంటారు. ఆంధ్రప్రజలు విభజన కోరలేదని, అయినా కాంగ్రెసు చీల్చిందని యిప్పుడు మాటిమాటికి అంటున్నారు. విభజన కోరుతున్నారని ఎర్రన్నాయుడు కమిటీ రిపోర్టు యిచ్చిందని, దాని ఆధారంగానే విభజన కోరుతూ లేఖ యిచ్చామనీ బాబు మర్చిపోయారా? మేం లేఖ యిచ్చాం, మీరు యివ్వలేదు అంటూ కాంగ్రెసును తోమేసిన విషయం మర్చిపోయారా? ఇది ద్రవ్య బిల్లు, హోదా యివ్వడంలో కష్టాలున్నాయి అని యిప్పుడంటున్న అరుణ్ జేట్లీని ఆ ముక్క అప్పుడు తెలియదా అని బాబు అడిగారా? మాట్లాడితే ఢిల్లీ 50 సార్లు వెళ్లాను, 70 సార్లు వెళ్లాను అంటారు. వెళ్లమని ఎవడడిగాడు? జయలలిత ఎన్నిసార్లు వెళ్లిందని తమిళనాడుకి ప్రాజెక్టులు వస్తూంటాయి?
కేంద్రంతో పోరాడితే నష్టం అంటున్నారు బాబు. తెలుగుదేశం పార్టీలో వుంటూ ఆ మాట అనడానికి తల దించుకోవాలి. ఆ పార్టీ పుట్టినదే రాష్ట్రప్రభుత్వాల హక్కులు కాపాడేందుకు. కేంద్రం మిథ్య అని హుంకరించిన ఎన్టీయార్ వారసులా వీరు? విభజన బిల్లులో వున్నవాటిని కూడా సాధించుకోలేక పోతున్నారే! కేంద్రంలో కాంగ్రెసు వుండి వుంటే బాబు యిలాగే మాట్లాడేవారా? తిట్టితిట్టి పోసేవారు కారా? మిత్రపక్షం కాబట్టి పోట్లాట ఎందుని చూస్తున్నాం అంటున్నారు. ఈ మిత్రపక్షం, శత్రుపక్షం రాజకీయ పరమైన సమీకరణాలు. ఆంధ్రప్రజలకు ఏ పార్టీతో ప్రమేయం లేదు. వారికి రావలసిన న్యాయమైన వాటా కేంద్రం నుంచి రావాలి. దట్సాల్. హుదూద్ తుపాను వలన జరిగిన నష్టమెంత? దానికి కేంద్రం నుంచి వచ్చిన పరిహారమెంత? తక్కువ వస్తే ఎందుకు వచ్చింది? రాలేదేమని అడగవలసిన పని ప్రజాప్రతినిథులది, ముఖ్యంగా సిఎంది, ఎంపీలది కాదా? టిడిపి-బిజెపి చెట్టాపట్టాలు వేసుకోవచ్చు, జుట్టూజుట్టూ పట్టుకోవచ్చు, అది వేరే విషయం. ఆంధ్ర ప్రజల తరఫున ప్రభుత్వంలో వున్న టిడిపి మిత్రుణ్నయినా, శత్రువునైనా నిలదీసి అడగాల్సిందే. లేకపోతే మిత్రధర్మం మాట ఎలా వున్నా ప్రజాధర్మం తప్పినట్లే! ఈ మధ్య నాలుగైదు రోజులుగా చేసిన అడావుడి కూడా హోదా అంశాన్ని ప్రతిపక్షాలు సెంటిమెంటుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయన్న భయం చేతనే. బంద్ ఫలితం చూశాక మరింత కంగారు పుట్టింది. టిడిపి ఎంపీలు పగటివేషాలతో సహా దిగిపోయారు. గొంగళిని యథాస్థానానికి తెచ్చేశారు.
బిజెపితో ఈ మొహమాటాలెందుకు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దానికి వాళ్లకు తోచిన ఊహాగానాలను జత చేస్తున్నాయి. అవేమీ కాదంటారీయన. కాకపోవచ్చు, మరి మౌనానికి అసలు కారణం ఏమిటో చెప్పాలి. కూటమి నుంచి బయటకు వచ్చేమని వాళ్లిచ్చే సలహా వినక్కరలేదు కానీ అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి వాళ్ల చేతే గట్టిగా అడిగిస్తే పోయేది కదా! అలా చేయరు సరికదా, ప్రతిపక్షాలు యిక్కడ గొడవ చేస్తే లాభమేముంది, ఢిల్లీ వెళ్లి చేయాలి కానీ అంటున్నారు. అంటే ఢిల్లీలో నిరసన ఊరేగింపు చేస్తే ఫలితం వుంటుందన్నమాట. అలా అయితే ఆంధ్ర రాజకీయపక్షాలన్నిటితో వూరేగింపు ఏర్పాటు చేసి ఆ వూరేగింపుకు తమరే ముందువరసలో నిలబడవచ్చు కదా? అదెందుకు చేయరు? కేంద్రాన్ని యిబ్బంది పెట్టనివ్వకూడదని అంత తాపత్రయం దేనికి? ఆంధ్ర, తెలంగాణ రెండు కళ్లు అనుకుంటూ ఓ కన్ను పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాని స్థానంలో కేంద్రాన్ని తెచ్చిపెట్టుకుని ఆంధ్ర కన్నుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్రం పట్ల మెతక వైఖరి అవలంబించే ముఖ్యమంత్రిని ఏ రాష్ట్ర ప్రజలూ మెచ్చరు. ఇదే ధోరణి కొనసాగితే ఆంధ్ర కన్ను పోయి, కేంద్రం కన్ను ఒక్కటే మిగలవచ్చు.
- ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)