విస్తరణ వేడిః రాజీనామా హెచ్చరికలు మరింత మంది..!

బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ కోడెలకు రాజీనామా లేఖను పంపించారు. మంత్రి పదవికి పనికిరాను తను.. ఎమ్మెల్యే పదవికి కూడా పనికి రాను అని ఆయన తన లేఖలో పేర్కొన్నారట. అందుకే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. నిజంగా చెప్పాలంటే బొజ్జలది విషాదగాథే. చంద్రబాబు వెంట అడుగడుగునా ఆయన వెంట నిలిచాడు ఆయన. వైస్రాయ్ వ్యవహారం నుంచి సొంత జిల్లా వాడిగా బాబు వెంట నిలిచారు బొజ్జల.

ఎన్టీఆర్ పై తిరుగుబాటు నేపథ్యంలో బొజ్జల బాబు వెంట నిలిచాడు. అంతే కాదు.. బాబుపై అలిపిరిలో జరిగిన అటాక్ సమయంలో కూడా బొజ్జల వెంట ఉన్నారు. బాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డాడు. ఇప్పుడు బొజ్జలకు అనారోగ్యం అంటున్నారు కదా.. ఆ అనారోగ్యం కూడా బాబు వెంట ఆ  రోజు ఉన్నందుకు ఫలితమేనట!

ఇలా తన వెంట అడుగడుగునా నిలిచిన బొజ్జలను కాదని, పార్టీ అధికారం సాధించుకోలేదేమోనని భయంతో పార్టీని వీడి, పక్క పార్టీ తరపున గెలిచి వచ్చిన అమరనాథ్ రెడ్డికి మంత్రి పదవిని ఇస్తుండటం బొజ్జలను కలిచి వేస్తోంది.

కేవలం బొజ్జల మాత్రమే కాదు.. విస్తరణ ఎఫెక్ట్ తో అసంతృప్తికి లోనయి రాజీనామా హెచ్చరికలు చేస్తున్న వారు మరికొంతమంది కనిపిస్తున్నారు. వారిలో బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, గౌతు శివాజీ కుటుంబం.. ఉండటం విశేషం. “రేయ్.. పాతేస్తా..’ అంటూ అసెంబ్లీలోనే హెచ్చరికలు జారీ చేసినా తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల బోండా ఉమ చాలా ఆవేధన భరితుడు అవుతున్నాడట.

ఈ మధ్య కాలంలో తీవ్రమైన స్వరాలతో మాట్లాడుతూ.. వచ్చినా బోండాకు ప్రయోజనం దక్కడం లేదు. అందుకే ఆయన కూడా రాజీనామా హెచ్చరిక చేస్తున్నారట.  బోండాను బుజ్జగించే పనిలో పడ్డాడట కేశినేని. కాపు కోటాలో తనకు పదవి దక్కుతుందని బోండా ఆశించాడు. అయితే బాబు అస్సలు కాపులను పట్టించుకోనే లేదు. ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో అన్నింటికీ పేచీ పెట్టుకొంటూ వచ్చిన అనిత కు కూడా ప్రయోజనం దక్కలేదు. మంత్రి పదవి విషయంలో బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్న ఆమెను బాబు పట్టించుకోలేదు.

Show comments