'ధృవ' ప్రీ రిలీజ్ వేడుక: పోసాని - కేటీఆర్ భజన

''ఎందరో సీఎంల కొడుకులున్నారు.. అందరూ ఎందుకు రాజకీయంగా రాణించలేకపోయారు.? కేటీఆర్‌ మాత్రమే ఎందుకు రాణించారు.? ఎందుకంటే, కేటీఆర్‌ టాలెంటెడ్‌ కాబట్టి.. విషయం వుంది కాబట్టే, కేటీఆర్‌ని కేసీఆర్‌ మంత్రని చేశారు. తన స్వశక్తితో కేటీఆర్‌ మంత్రి అయ్యారు.. కేటీఆర్‌ అంటే యూత్‌ ఐకాన్‌..'' ఇలా సాగింది సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి ప్రసంగం 

ఇదేదో, రాజకీయ వేదిక మీద జరిగింది కాదు.. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన 'ధృవ' ఆడియో విడుదల వేడుకలో ఆద్యంతం కేటీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేందుకు నానా తంటాలూ పడ్డారు పోసాని కృష్ణమురళి. కేటీఆర్‌ని పొగిడేయడం అయిపోయిన తర్వాత, పోసాని పొగడ్తల ప్రవాహం చిరంజీవి - చరణ్‌ల వైపు మళ్ళింది. కేసీఆర్‌ - కేటీఆర్‌ ఎలానో, చిరంజీవి - రామ్‌చరణ్‌ అంతేనని పోసాని చెప్పుకొచ్చారు. 

''సినీ రంగంలో ఎందరో ప్రముఖులున్నారు.. వారి వారసులంతా సక్సెస్‌ అయిపోలేదు.. కొందరు మాత్రమే సక్సెస్‌ అయ్యారు. చరణ్‌, సినిమాల్లోకి రావాలనుకున్నాక తండ్రి చిరంజీవి కంటే గొప్పగా ఫైట్స్‌ చేయాలని కష్టపడ్డాడు.. డాన్సులు చేయడానికి కష్టపడ్డాడు.. ఆ కష్టమే చరణ్‌ని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది..'' అంటూ సాగింది పోసాని ప్రసంగం. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో సింహభాగం పొగడ్తలు కేటీఆర్‌ మీదకే వెళ్లాయి పోసాని నుంచి. 

మామూలుగా పోసాని వున్నది వున్నట్లుగా మాట్లాడేసే వ్యక్తి.. ఇప్పుడెందుకో, ఆయనలో ఇదివరకు కన్పించని కొత్త కోణం.. అదే పొగడ్తల కోణం చాలా ఎక్కువగా కన్పించింది. అంతా 'ధృవ' మహిమ అనుకోవాలేమో.!

Show comments