ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతకం ఏమిటో అర్థం కావడంలేదు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి నేషనల్ లీడర్లను తన చుట్టూ తిప్పుకున్న ఈ నాయకుడు ఇప్పుడు ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్నా, కేంద్రంలో అధికారం పంచుకుంటున్నా, కాషాయ పార్టీ రాష్ట్ర సర్కారులో భాగస్వామి అయినా గత రెండున్నరేళ్లుగా ఈ దయనీయ స్థితి తప్పడంలేదు. నిజానికి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రాన్ని బతిమాలుకోవాలి. మిత్రపక్షం అధికారంలో రాష్ట్రం సులభంగా పనులు చేయించుకోవాలి.
కాని చంద్రబాబు విషయంలో ఇది తలకిందులైంది. 'మరో ముందడుగు' అంటూ అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి మళ్లీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించారు. మొన్న ఓ టీవీ ఛానెల్లో జరిగిన చర్చలో ఓ జర్నలిస్టు బాబు శంకుస్థాపనల ప్రహసనం 'జరగాలి చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అనే డైలాగ్ మాదిరిగా ఉందని చమత్కరిస్తూ విమర్శించారు. బాబు 'షో మ్యాన్' కాబట్టి ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు. సరే...అదలా ఉంచితే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి (నిజానికి ఇది ప్రత్యేక సాయం మాత్రమే. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించలేదు) చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గట్టిగా విజ్ఞప్తి చేశారు.
'పచ్చ' పార్టీ పత్రికలో వచ్చిన వార్తనుబట్టి చూస్తే అరుణ్ జైట్లీని బాబు బతిమాలుకున్నారని అనిపిస్తోంది. విందు చర్చలో అరుణ్ జైట్లీతో మాట్లాడిన బాబు 'హోదాకు సమానమైన ప్యాకేజీ ఇవ్వడం బాగానే ఉంది. ప్యాకేజీ ప్రకటించి రోజులు గడుస్తున్నా నిధుల విడుదల ఆలస్యం కావడంవల్ల చెడ్డ పేరు వచ్చేలా ఉంది. ప్రతిపక్షాలు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించి నిధులు విడుదల చేస్తే అందరికీ మంచి పేరు వస్తుంది' అని చెప్పారు. దీనికి జైట్లీ వచ్చే కేబినెట్ సమావేశంలోగాని లేదా ఆపై వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగాని చట్టబద్ధతపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కొన్నిరోజుల కిందట అర్థరాత్రిపూట అరుణ్ జైట్లీ సహచర మంత్రి వెంకయ్య నాయుడితో కలిసి ఆంధ్రాకు ప్రత్యేక సాయంపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరకు రక్తం మరిగిపోయిన చంద్రబాబుకు ఈ ప్రకటన తరువాత ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇచ్చింది తీసుకోక తప్పలేదు. ప్రత్యేక హోదాను వద్దనుకొని బాబు ఇంతగా సర్దుబాటు అయిన తరువాత కేంద్రం ఏం చేయాలి? వెంటనే ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించి నిధులు విడుదల చేయాలి. కాని ఎప్పటిమాదిరిగానే జాప్యం చేస్తోంది. మళ్లీ చంద్రబాబు బతిమాలుకొని కాళ్లూ గడ్డం పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్నిబట్టి చూస్తే ఏపీని కేంద్రం పురుగును చూసినట్లు చూస్తోందని అర్థమవుతోంది.
మొత్తం మెట్లు దిగొచ్చిన తరువాత కూడా జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెసుతో కలిసి చురుగ్గా వ్యవహరించిన బీజేపీ విడిపోయాక 'చేద్దాం...చూద్దాం' అనే రీతిలో వ్యవహరిస్తోంది. చంద్రబాబు ప్రత్యేక హోదాకు తిలోదకాలిచ్చి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించి నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుండటంతో ప్రతిపక్షాలు మరింతగా విజృంభిస్తాయని భయపడుతున్నారు. ప్రత్యేక హోదా వదిలేయడంపై ప్రజలకు నచ్చజెప్పుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్న బాబు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంలో జరుగుతున్న జాప్యంపై కూడా జవాబు చెప్పుకోవాలి.
దీనిపై మరింత జాప్యం జరిగితే ఇది కూడా ప్రత్యేక హోదా టైపేనని అనుమానాలు కలగడం గ్యారంటీ. బాబుకు పాలనాపరంగా ఉన్న సమయం తక్కువ. కేంద్రం నుంచి జరుగుతున్న ఆలస్యం ఎక్కువ. విభజనతోనే కాకుండా ప్రత్యేక హోదా రాకుండా అన్యాయమైపోయిన ఏపీకి హామీ ఇచ్చిన సాయాన్ని కూడా ఇవ్వడంలో కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడంలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మాటలు కోటలు దాటుతున్నాయి. కాని చేతలు గడప దాటడంలేదు. ఈ ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు మళ్లీ ఢిల్లీ చుట్టూ తిరగాలేమో...!
ప్రత్యేక హోదా కోసం దాదాపు ముప్పయ్‌సార్లు ఢిల్లీ వెళ్లానని గతంలో చెప్పారు. హోదా కోసం తాను కష్టపడ్డానని చెప్పడం ఆయన ఉద్దేశం. కాని ఒక ముఖ్యమంత్రి అన్నిసార్లు తిరగడమంటే అది ఆయన నిస్సహాయ స్థితికి నిదర్శనం. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకపోతే మళ్లీ ఇదే పరిస్థితి ఏర్పడుతుందేమో....!