చిరంజీవిని అంత మాట అనేశాడేంటీ.?

చిరంజీవితో ఆయనది విన్నింగ్‌ కాంబినేషన్‌. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. చిరంజీవిని మాస్‌ హీరోగా మలచడంలో ఆయన సినిమాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన ఎవరో కాదు, చిరంజీవి అభిమానులకు అమితంగా ఇష్టమైన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. మాస్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా కోదండరామిరెడ్డికి వున్న పేరు ప్రఖ్యాతులు అలాంటిలాంటివి కావు. 

ప్రస్తుతానికి దర్శకత్వంపై ఆయనకు ఇంట్రెస్ట్‌ లేదుగానీ, చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే కామెడీ సినిమానే చేస్తానంటూ కోదండరామిరెడ్డి పెద్ద బాంబే పేల్చారు. ఇది నిజంగానే బాంబు. ఎందుకంటే, ఆయన 'చిరంజీవి మెసేజ్‌ సినిమాలు చేస్తానంటే నవ్వుకుంటారు..' అనే సీరియస్‌ కామెంట్‌ని తన వ్యాఖ్యలకు యాడ్‌ చేశారు మరి.! 

రాజకీయాల్లోకి వచ్చి, చిరంజీవి తన 'విశ్వసనీయతను' కోల్పోయారన్న విమర్శలు వుండనే వున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్‌ పార్టీలో కలిపేసి, కేంద్ర మంత్రి పదవిని కొన్నాళ్ళపాటు ఎంజాయ్‌ చేసిన చిరంజీవి, ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడిగా పదవిలో కొనసాగుతున్నారు. మరి, చిరంజీవి తన సినిమాలతో మెసేజ్‌లు ఇస్తానంటే ఎలా.? బహుశా, కోదండరామిరెడ్డి వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదే కావొచ్చు. 

అయినా, తనకు అత్యంత సన్నిహితుడైన చిరంజీవి విషయంలో కోదండరామిరెడ్డి ఎందుకు ఇంత సీరియస్‌ వ్యాఖ్యలు చేసినట్లు.? ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవరికీ అర్థం కావడంలేదు. ఏ విషయంలో చిరంజీవికీ కోదండరామిరెడ్డికీ చెడిందనుకోవాలి.? ఈ వ్యాఖ్యలపై చిరంజీవి ఎలా స్పందిస్తారు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. Readmore!

Show comments