హెచ్ బీవో ఆఫీస్ పై సైబర్ ఎటాక్.. గేమ్ ఆఫ్ త్రోన్స్ హ్యాకింగ్

తెలుగులో బిగ్ బాస్ షో రంజుగా సాగుతోంది. సంపు పక్కకు తప్పుకున్నాడు. మధుప్రియ ఎలిమినేట్ అయింది. నెక్ట్స్ ఏం జరగబోతోంది? రాబోయే రోజుల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్స్ అన్నీ ముందుగానే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే "గేమ్ ఆఫ్ త్రోన్స్" సిరీస్ కు ఎదురైంది. 

హెచ్ బీవో ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ సూపర్ హిట్ సిరీస్ పైరసీకి గురైంది. కొందరు వ్యక్తులు హెచ్ బీవో ఆఫీస్ ఐటీ వ్యవస్థను హ్యాక్ చేశారు.. ఏకంగా 1.5 టెరాబైట్స్ సమాచారాన్ని దొంగిలించారు. ఇందులో గేమ్ ఆఫ్ త్రోన్స్ సీజన్-7కు సంబంధించి త్వరలోనే ప్రసారం కానున్న ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో నటిస్తున్న నటీనటులు హాలీవుడ్ స్టార్స్ తో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు పైరసీకి గురైంది.

అయితే జీవోటీ (గేమ్ ఆఫ్ త్రోన్స్)ని దొంగిలించిన వ్యక్తులు ఆ ఎపిసోడ్స్ ను ఇంకా ఇంటర్నెట్ లో పెట్టలేదు. ప్రస్తుతం వాళ్లతో హెచ్ బీవో సంప్రదింపులు జరుపుతోంది. డబ్బు లేదా ప్రచారం ఆశించి ఇలాంటి హ్యాకింగ్ కు పాల్పడుతుంటారు దుండగులు. వాళ్లకు డబ్బే కావాలనుకుంటే ఇస్తామంటోంది హెచ్ బీవో. అయితే ప్రచారమే కావాలనుకుంటే మాత్రం ఏదో ఒక వెబ్ సైట్ లో ఈ సిరీస్ ఎపిసోడ్స్ ప్రత్యక్షమవ్వడం ఖాయం.

గతంలో సోనీ పిక్చర్స్ కు చెందిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో కొంత భాగాన్ని ఇలానే దొంగిలించారు. సినిమా విడుదలకు ముందే దాన్ని లీక్ చేస్తామని బెదిరించారు కొందరు వ్యక్తులు. పైకి వెల్లడించని మొత్తానికి ఆ వివాదాన్ని సెటిల్ చేసుకుంది సోనీ పిక్చర్స్ సంస్థ. ఇప్పుడు హెచ్ బీవో ఏం చేస్తుందో చూడాలి.

Show comments