మోడీజీ ఏమిటి ఈ మోసం..?!

అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో తీవ్ర స్థాయి పతనం నమోదైనప్పుడేమో ఇండియాలో పెట్రో ధరలు పైసలను ప్రమాణికంగా పెట్టుకుని తగ్గించారు. అటువైపు క్రూడ్ ధరల్లో కాస్తంత హెచ్చు కనిపించగానే ఇక్కడ మాత్రం రూపాయల్లో పెంచేస్తున్నారు! మరి దీన్ని మోసం అనాలా? మంచి రోజులు అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ గారు ఇప్పుడు దీనిపై స్పందించకపోవడం దారుణం అనాలా!

తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే శ్రీమాన్ నరేంద్రమోడీ ఇలాంటి అంశాలపై ఘాటుగా స్పందించేవారు. యూపీఏ హయాంలో పెట్రో ధరల్లో పెంపుదల నమోదైతే.. మొదట విరుచుకుపడేది మోడీనే. అసమర్థత పాలన, అవినీతి పాలన.. అందుకే ఇలా పెట్రో ధరలు పెంచుతున్నారు.. చేతగాని దద్దమ్మలు అంటూ ఆయన కాంగ్రెస్ వాళ్లను నిందించే వాడు. దీనికి ఆయన పాత ట్వీట్లే సాక్షి.

అయితే కాంగ్రెస్ ను అంతలా తిట్టి అధికారంలోకి వచ్చిన మోడీజీ.. ఇప్పుడు మాత్రం పెట్రో ధరల పెంపు తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు ఒపెక్ దేశాలు అన్నీ అల్లాడి పోతున్నాయి. క్రూడ్ ధర బ్యారెల్ కు ఒక డాలర్ పెరుగుదల.. ఒకటిన్నర డాలర్ పతనం అన్నట్టుగా కొనసాగుతోంది పరిస్థితి. సెప్టెంబర్ నెలాఖరులో భారత్ ఎక్కువగా కొనుగోలు చేసే ట్రెంట్ చమురు బ్యారెల్ ధర 1.76 డాలర్లు పడింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం నాలుగు శాతం పడిపోయి 44.48 డాలర్లకు చేరింది.

ఆ 1.76 డాలర్ల పతన స్థాయి నుంచి కూడా చమురు ఉత్పత్తుల మీద ఆధారపడ్డ దేశాలు ఇంకా కోలుకోలేదు. అయితే .. ఇండియాలో మాత్రం భారీ వడ్డన విధించారు. డీజిల్ మీద పెంపు లీటర్ కు రెండు రూపాయల పైనే ఉంది. దీని ఫలితంగా నిత్యవసర వస్తువుల ధరలన్నీ పెరిగే అవకాశం ఉంది!

ఇప్పుడు కాదు.. రెండు సంవత్సరాల నుంచి ముడిచమురు ధరల్లో తీవ్రమైన పతనం ఉంది. ఫలితంగా ఒపెక్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఈ ధరలపై నియంత్రణ తీసుకురావాలని సౌదీ అరేబియా మొత్తుకుంటోంది. లేకపోతే ఇలాంటి దేశాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీని కోసం ఒపెక్ దేశాలన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకోవడానికి ఆ దేశం తపన పడుతోంది.

మరి వాళ్ల కష్టాలు అలా ఉంటే.. మంచి రోజుల మోడీ సర్కారు ఉన్న మన దేశం కష్టాలు ఇలా ఉన్నాయి. యూపీఏ హయాంలో పెట్రో ధరలు పెరిగితే.. వార్తా పత్రికలు,  టీవీ చానళ్లు, కమ్యూనిస్టు పార్టీలు.. ఇలా అంతా రంకెలు వేసే వాళ్లు. ఇదేంటి అని ప్రశ్నించేవాళ్లు. అయితే మోడీ హయాంలో క్రూడ్ ధరకూ, దేశంలోని పెట్రో ధరలకూ ఏ మాత్రం పొంతన లేకపోయినా.. ఈ వ్యాపారంలో చమురు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ అవకాశాల మేరకు ప్రజలను దోచేసుకుంటున్నా.. ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు.

జనాలు కూడా దోపిడీకి గురి కావడానికి అలవాటు పడ్డారు కాబోలు. ఏం జరిగినా.. ఆయన ఎన్ని రంగులు మార్చినా.. అప్పుడో మాట ఇప్పుడో మాట చెబుతున్నా, ప్రజలను ఇలా దోచేస్తున్నా.. తన అసమర్థతను ఇలా ప్రదర్శిస్తున్నా.. మోడీని మాత్రం ఏమనకూడదు. నేటికి ‘దేశ  భక్తి’ ఇదే!

Show comments