అమ్మకోసం బలిదానం.!

రాజకీయ నాయకుల కోసం బలవన్మరణాలకు పాల్పడటమేంటి.? అన్న చర్చ ఈనాటిది కాదు. తమ నాయకుడి కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకు వెనుకాడబోమంటూ కార్యకర్తలు, అభిమానులు వీరావేశంతో ప్రకటనలు చేసేస్తుంటారు. ప్చ్‌, రాజకీయ నాయకులు మాత్రం అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కార్యకర్తలు ఎప్పుడూ పేదోళ్ళే.. రాజకీయ నాయకులెప్పుడూ అపర కుబేరులే. ఇది చరిత్ర చెప్పే నగ్న సత్యం. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 12 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవాలంటూ అభిమానులు నోట్లో శూలాలు గుచ్చుకుంటున్నారు.. వీపుకి హుక్స్‌ గుచ్చుకుని, గాల్లో తేలాడుతున్నారు.. రక్తమోడుతూనే అభిమానులు చేస్తోన్న ఈ ఫీట్స్‌ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 

కొందరు ఇప్పటికే అమ్మ అనారోగ్యం వార్త విని, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారట. ఒకరిద్దరు బలవన్మరణాలకు పాల్పడినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు 'అమ్మ'కి ఏమయ్యింది.? అనే విషయమై ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. వైరల్‌ ఫీవర్‌తో ఆమె బాధపడుతున్నారంటూ పది రోజుల క్రితం వైద్యులు ప్రకటించారు. అంతే, ఆ తర్వాత అమ్మ ఆచూకీ లేదు. విదేశాల నుంచి వైద్యుల్ని తీసుకొచ్చారు.. ఆయన చికిత్సకు జయ స్పందిస్తున్నట్లు నిన్న రాత్రి మరో ప్రకటన వెల్లడయ్యింది. 

ఆసుపత్రిలో అమ్మ పరిస్థితి ఎలా వుందన్నదానిపై ఒక్క ఫొటో కూడా విడుదల చేయడంలేదంటే, తీవ్రమైన అనారోగ్యంతోనే ఆమె బాధపడుతున్నారనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుందనీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లోకి సంకేతాలు వెళ్ళాయి. దాంతోనే ఈ విపరీత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత ఆరోగ్యంపై క్రియేట్‌ అవుతున్న సస్పెన్స్‌ కూడా అభిమానుల మరణాలు, బలవన్మరణాలకు కారణంగా చెప్పుకోవచ్చు. 

ఇలాంటి సందర్భాల్లోనే సంయమనం అవసరం. కానీ, ఆ సంయమనమే వుంటే అది రాజకీయం ఎందుకవుతుంది.?

Show comments