పంజాబ్ ఎన్నికలు మరి.. అవే పంచుతారు!

ఓట్ల విషయంలో జనాలను ప్రలోభాలకు గురి చేయడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి వారు అప్ డేట్ అవుతూ వస్తున్నారు. అలాగే ఏ పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఆ పంపకాలు జరుగుతూ ఉంటాయి. 

నోటు కావాలని అడిగిన వాడికి నోటు.. మద్యం కావాలని అడిగేటోనికి బాటిల్, ఆడవాళ్ల కోసం కుంకుమ భరిణెల దగ్గర నుంచి  మొదలుపెట్టి ముక్కు పుడకలు, కమ్మలు, చీరలు..  ఇలా ఏది ట్రెండీ అనిపిస్తే ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. 

ఇలాంటి సగర్వమైన భారత ప్రజాస్వామ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాల వల అక్కడి పరిస్థితులకు, అక్కడి  ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది! ఏకంగా మాదక ద్రవ్యాలనే పంచుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటి వరకూ నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ డంప్ లు బయటపడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో పంపకాలకు ఈ మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు!

అత్యంత సంపన్నమైన రాష్ట్రం గా అభివృద్ధి చెందిన పంజాబ్ ఛిద్రం అయిపోతున్న విధానం అందరికీ ఎరుకలో ఉన్నదే. అక్కడి యువత పై డ్రగ్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాల యువత వీటికి బానిస అయ్యింది. గత కొన్నేళ్ల లో పరిస్థితి విషమించింది. రాజకీయ పార్టీల నేతలే ఈ డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీ నేతలపై ఈ ఆరోపణలున్నాయి. పోలీసులకు కూడా వాటాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ‘ఉడ్తా పంజాబ్’ సినిమా పంజాబ్ ప్రస్తుత జీవన చిత్రాన్ని చాటింది. Readmore!

ఈ నేపథ్యంలో.. ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు డ్రగ్స్ కు డిమాండ్ పెరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మాదకద్రవ్యాలను విసురుతున్నాయి పార్టీలు. ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో ఓటు అంటే చీప్ లిక్కర్ కు, సారాయికి పడేదనే పరిస్థితి కనిపిస్తుంటే.. పంజాబ్  మాత్రం ఓటు విలువ డ్రగ్స్ స్థాయికి చేరింది! గొప్ప అభివృద్ధే! 

Show comments