బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ని 'సల్లూభాయ్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ అభిమానుల్ని 'భాయ్ చెంచాస్..' అనేసింది ఓ సింగర్. 'డియర్ భాయ్ చెంచాస్..' అంటూ అభిమానుల్ని ఉద్దేశించి ఆ సింగర్ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికే తెరలేపింది. ఇంకేముంది, అభిమానులూ చెలరేగిపోతున్నారు.
తన తాజా చిత్రం 'సుల్తాన్' షూటింగ్ అనుభవాల్ని చెబుతూ, 'రేప్‌కి గురైన మహిళలా నా పరిస్థితి వుండేది..' అని సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమయిన విషయం విదితమే. చాలామంది సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అంతగా సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యల్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఇంకొందరు కామెంట్ చేశారు. సాక్షాత్తూ సల్మాన్‌ఖాన్ తండ్రి, సలీమ్‌ఖాన్ తన కొడుకు చేసింది తప్పేనన్నాడు.
ఇక, సింగర్ సోనా మహాపాత్ర మాత్రం, సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించేసింది సోషల్ మీడియాలో. అంతే, ఆమెపై అభిమానులు విరుచుకుపడిపోయారు. 'ఆంటీ..' అంటూ సంబోదించారు. అంతేనా, బూతులు తిట్టేశారు. అభిమానులు తిట్టిన తిట్లను కొన్నింటిని ఏరి, వాటిని మళ్ళీ తన పోస్టింగ్‌లో జత చేసిన సోనా మహాపాత్ర, 'నేను ఆంటీని అయితే మీ 50 ఏళ్ళ బాలుడి సంగతేంటి.?' అంటూ మరో పంచ్ డైలాగ్ పేల్చింది.
అభిమానులు ఊరుకుంటారా.? ఇంకా పవర్‌ఫుల్‌గా, సోనా మహాపాత్రతో సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. ఇంకో పక్క, సల్మాన్‌ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండడం, ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తుండడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, సోనా మహాపాత్ర అనే సింగర్ ఇప్పటిదాకా అంతంతమాత్రంగానే కొందరికి తెలుసు. ఆమె ఇప్పుడు సల్మాన్‌ఖాన్ పేరు చెప్పి, విపరీతమైన పాపులారిటీ పొందుతోంది.