నారాయణ నారాయణ: నో కామెంట్‌.!

'స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో దాని గురించి నేనేమీ మాట్లాడలేను.. నో కామెంట్‌..' అంటూ మంత్రి నారాయణ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు సర్కార్‌ అనుసరిస్తున్న 'లోపాయకారీ ఒప్పందం' స్విస్‌ ఛాలెంజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఉన్నత న్యాయస్థానం సైతం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే విధించింది కూడా. 

వాస్తవానికి రాజధాని నిర్మాణ ప్రక్రియ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇంకే ఇతర మంత్రులూ ఇందులో జోక్యం చేసుకునే పరిస్థితే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే, సుదీర్ఘ రాజకీయ అనుభవం వుంది.. ప్రజా క్షేత్రంలో పలు మార్లు గెలిచిన చరిత్ర వుంది. కానీ, నారాయణ మాటేమిటి.? ఆయనో విద్యాసంస్థల అధిపతి. అంతకు మించి, రాజకీయంగా అతనికి ఏమాత్రం అనుభవం వున్న పరిస్థితి అయితే లేదు. కానీ, ఆయన మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన వ్యక్తి. అందునా, రాజధాని నిర్మాణ బాధ్యతలు పూర్తిగా ఆయన మీదనే వున్నాయి. 

రాజధాని నిర్మాణ పనుల్ని నారాయణ నెత్తిన చంద్రబాబు పెట్టడం వెనుక పెద్ద కథే వుందన్న ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతి పరిధిలో జరిగిన భూ కుంభకోణంలోనూ నారాయణ పాత్రపై అనుమానాలు కుప్పలు తెప్పలుగా వున్నాయన్నది నిర్వివాదాంశం. స్విస్‌ ఛాలెంజ్‌ ఎపిసోడ్‌లోనూ చంద్రబాబుతోపాటు, నారాయణపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఆయన మాత్రం సింపుల్‌గా 'నో కామెంట్‌' అనేస్తే ఎలా.? 

అవునా, కోర్టు విచారణలో వున్న అంశాలపై మాట్లాడకూడదా.? అలాగైతే, జగన్‌ అక్రమాస్తుల కేసు విషయంలో ఎందుకు మాట్లాడుతున్నట్లు.? కోర్టు విచారణలో వున్నాసరే, తమకు నచ్చిన అంశాలపై మాట్లాడతారు. సమాధానం చెప్పలేనప్పుడు మాత్రమే 'నో కామెంట్‌' అంటూ తప్పించుకు తిరుగుతారు. ఇదీ అమాత్యుల తీరు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం. వేలాది మంది రైతుల త్యాగ ఫలం. అలాంటి అమరావతి విషయంలో కుట్రపూరితంగా స్విస్‌ ఛాలెంజ్‌ని తెరపైకి తెచ్చి, అందులోనూ రహస్య ఒప్పందాలను చేర్చడాన్ని ఏమనుకోవాలి.?

Show comments