మున్నాభాయ్‌ మళ్ళీ జైలుకెళ్తాడేమో.!

బహుశా దేశ చరిత్రలో ఇంకెవరికీ ఇంతగా 'ఆఫర్స్‌' లభించి వుండవేమో.! ఎంతైనా వీఐపీ కదా.. అందునా, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న సినీ సెలబ్రిటీ. అందుకే, 'టాడా' చట్టం కింద అరెస్టయినా, సంజయ్‌దత్‌కి ఊరట మీద ఊరట లభిస్తూ వచ్చింది. రెడ్‌ హ్యాండెడ్‌గా ఇంట్లో నిషేధిత ఆయుధాలతో సంజయ్‌దత్‌ దొరికేశాడు. పైగా, అవి దేశంలో మారణహోమం సృష్టించేందుకు తీవ్రవాదం, మాఫియా కలిసి ఉపయోగించినవి.! 

ఈ కారణంగానే, సంజయ్‌దత్‌ తప్పించుకోలేకపోయాడు, జైలుకెళ్ళాడు. కానీ, ఊరట పొందాడు. మధ్యలో కొన్నాళ్ళు జైలు నుంచి బయటకొచ్చి, మంచి మంచి సినిమాలు చేసి అప్పటిదాకా వున్న బ్యాడ్‌బాయ్‌ ఇమేజ్‌ని చెరిపేసుకుని గుడ్‌ బాయ్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. కాలం వెక్కిరించింది, మళ్లీ జైలుకెళ్ళాడు సంజయ్‌దత్‌. రెండోదఫా కూడా సంజయ్‌దత్‌ పలు ఊరటలు పొందాడు జైలు శిక్ష అనుభవిస్తుండగానే. 

రకరకాల కారణాలు చూపుతూ పెరోల్‌ని ఒకటికి రెండుసార్లు సాధించిన సంజయ్‌దత్‌ అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఈ వివాదాలు ఇలా నడుస్తుండగానే 'సత్‌ప్రవర్తన' కారణంగా సంజయ్‌దత్‌ ముందస్తు విడుదలకు రంగం సిద్ధమయ్యింది. కానీ, మళ్ళీ కాలం వెక్కిరించేలా వుంది. సంజయ్‌దత్‌ మళ్ళీ జైలుకెళ్ళక తప్పేలా కన్పించడంలేదు. 

'సంజయ్‌దత్‌కి అంత సులువగా కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా పెరోల్‌ దక్కడమేంటి.?' అన్న అంశంపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్నీ న్యాయస్థానం ఇదే విషయమై ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం, 'మళ్ళీ సంజయ్‌దత్‌ని జైలుకు పంపించాల్సి వస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు..' అని తేల్చేసింది. సో, కొద్ది రోజుల్లోనే సంజయ్‌దత్‌ తిరిగి జైలుకు వెళ్ళాల్సి రావొచ్చనీ, పొందిన 'ఊరట'ని జైల్లో ఖర్చు చేయాల్సి రావొచ్చనీ భావించొచ్చేమో.! 

Show comments