పార్ట్-1 రిలీజ్ చేసి తప్పుచేశారా..?

బాహుబలి-ది కంక్లూజన్ కోసం జక్కన్న అండ్ టీం ఎంత చేయాలో అంతా చేస్తోంది. ప్రచారానికి పనికొచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. డబ్బుకు లోటు లేకపోవడంతో పార్ట్-2 రిలీజ్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. ఇందులో భాగంగా బాహుబలి-ది బిగినింగ్ సినిమాను ఉత్తరాదిన మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వెయ్యి థియేటర్లను లాక్ చేశారు. అడ్వాన్స్ లు ఇచ్చేశారు. భారీ స్థాయిలో బాహుబలి పార్ట్-1ను రీ-రిలీజ్ చేశారు. కానీ పార్ట్-1 మాత్రం థియేటర్లలో ఫ్లాప్ అయింది. 

శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కేవలం 40 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే సంపాదించగలిగింది. వీకెండ్ లో పుంజుకుంటుందని ఆశించినప్పటికీ.. శనివారం కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఉత్తరాది జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పటికే చాలా మంది సినిమా చూసేయడంతో పాటు బ్లూ-రే ప్రింట్స్ కూడా అందుబాటులోకి రావడంతో బాహుబలి పార్ట్-1.. రీ-రిలీజ్ లో ఫ్లాప్ అయింది.

మరోవైపు పార్ట్-2కు టిక్కెట్లు ఇస్తామంటూ ఊరించినప్పటికీ.. పార్ట్-1 చూసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో బాహుబలి టీం రీ-రిలీజ్ అంశాన్ని లైట్ తీసుకుంది. కొత్తకొత్త ప్రమోషనల్ యాంగిల్స్ ను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వోడాఫోన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న బాహుబలి నిర్మాతలు... ఐపీఎల్ ఫీవర్ కు బాహుబలి-2ను కనెక్ట్ చేసేందుకు రెడీ అవుతోంది.

Show comments