డీకే అరుణ.. డిమాండ్ తీర్చిన కేసీఆర్!

కోరుకున్న వారికి కోరుకున్నన్ని ఇచ్చేద్దాం.. అడిగిన ప్రాంతాన్ని అడిగినట్టుగా జిల్లాగా చేసేద్దాం.. ఇందులో రెండో ఆలోచన ఎందుకు? అన్నట్టుగా స్పందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ జిల్లాల పునర్విభజన, నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ మరి కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు! గద్వాల, సిరిసిల్ల, జనగామ ల విషయంలో ఉన్న ప్రత్యేక జిల్లాల డిమాండ్ కు ఆయన ఓకే చెప్పేశాడు. దీంతో.. తెలంగాణలో నూతనంగా ఏర్పాటవుతున్న జిల్లాల్లో మూడు పెరిగినట్టు అయ్యింది.

గద్వాలను జిల్లాగా చేయాల్సిందే అని డీకే అరుణ డిమాండ్ చేసిన సంగతి తెలిసింది. ఒకవేళ దాన్ని ప్రత్యేక జిల్లాగా చేయకుంటే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆమె ప్రకటించింది. గద్వాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడానికి ఆమె దీక్ష కూడా చేసింది. ఆమె డిమాండ్ మేరకు అని చెప్పడం లేదు కానీ.. ప్రజాకాంక్ష మేరకు అంటూ గద్వాలను జిల్లాగా చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదేమైనా.. గద్వాల విషయంలో గట్టి డిమాండ్ వినిపించిన ఘనత అరుణకే దక్కుతుందని చెప్పాలి. కల్వకుర్తి డివిజన్ ను ప్రత్యేక జిల్లాగా చేయాలన్న కాంగ్రెస్ నేత వంశీధర్ రెడ్డి డిమాండ్ ను మాత్రం కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఈ విధంగా ఇష్టానుసారం .. తోచినట్టుగా .. డిమాండ్లకు అనుకూలంగా జిల్లా సంఖ్యను పెంచుకొంటూ పోవడాన్ని కేసీఆర్ ప్రభుత్వం సమర్థించుకుంది. దీని కోసం కొన్నిలాజిక్కులు చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రతి  తొమ్మిది వేల జనాభానూ ఒక  జిల్లాగా విడగొట్టారని.. తెలంగాణలో ఇలా చిన్న జిల్లాలు చేయడంలో తప్పేముంది? అని ప్రశ్నించింది. అయినా తెలంగాణ రాష్ట్రాన్ని, కొండ గుట్టలతో ఉండే అరుణాచల్ ప్రదేశ్ తో పోల్చడం ఏమిటో!

Show comments