సినిమా.. అమ్మాయిని అడ్డం పెట్టుకుచేసే వ్యాపారం కాదుగా

ఒక కామెడీ షో ఇమేజ్ అంత వరకే పరిమితం.. ఆ మాత్రం గుర్తింపుతో ఇండస్ట్రీనే దున్నేద్దామంటే సాధ్యం అయ్యే పని కాదు. ఏదో ఒకటీ అర పాత్రలు కనిపించడం వరకూ ఓకే గానీ, మరీ రష్మీ ఇమేజ్ తో మాత్రమే సినిమాలను చుట్టేద్దామంటే .. అది కుదిరే పని కాదని, ఔత్సాహిక రష్మీ అండ్ కో గుర్తుంచుకుంటే మంచిది!

జబర్ధస్త్ ఫేమ్ రష్మీ కి జనాల్లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అన్నట్టుగా వరస పెట్టి సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ కూడా కనీసం పోస్టర్ల ఖర్చును కూడా సంపాదించుకోలేకపోతున్నాయి. కానీ ఇలాంటి సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి! ఇంకా ఔత్సాహికులు రష్మీ పేరు చెబితే, రష్మీ హాట్ పోజుల్లో చూపితే సినిమా టికెట్లు తెగిపోతాయనే భ్రమల్లోనే ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది.

‘గుంటూరు టాకీస్’ వంటి సినిమాకు రష్మీ ప్లస్ అయ్యింది.. ఎందుకంటే, అది ఆమె పై ఆధారపడి తీసిన సినిమా కాదు. అందులో ఒక పాత్ర లో చేసింది తను. అందులో ఆమె హాట్ గా కనిపించడం దానికి కొంతవరకూ ప్లస్ అయ్యింది. కానీ.. అతి తెలివైన వాళ్లు .. ఆ సినిమాలో రష్మీని తప్ప మరేం చూసినట్టుగా లేరు. 

జబర్దస్త్ రష్మీ నటించిన సినిమా అంటూ.. వరస పెట్టి సినిమాలను తీస్తున్నారు. సినిమాకు కథ, కథనం, ఇక వేరే స్టార్ క్యాస్ట్ అవసరం లేదు.. రష్మీ ఉంటే చాలనే భావనతో వస్తున్న ఇలాంటి సినిమాలన్నీ ఒకటీ, అర షోలకు పరిమితం అవుతున్నాయి! సినిమా అంటే ఎవరో ఒక అమ్మాయిని హాట్ గా చూపిస్తూ చేసుకునే వ్యాపారం కాదు కదా! ఇవి అలాంటి రోజులు కాదు కదా!

Show comments