అవును.. ఈవిడ ఆవిడే.. డౌటేం లేదు.!

డీ గ్లామర్‌ పాత్రల్లో కనిపించడం అందాల భామలకు ఎప్పుడూ 'సవాల్‌'తో కూడుకున్నదే. తమను గ్లామరస్‌గా చూసే ప్రేక్షకులు, గ్లామర్‌ లేని పాత్రల్లో చూడాలంటే కష్టమేనని అందాల భామలు నమ్ముతుంటారు. హీరోలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. 'బాహుబలి' సినిమా కోసం అనుష్క పెద్ద రిస్కే చేసింది. అనుష్కని 'బాహుబలి' సినిమాలో చూసినవారంతా షాక్‌కి గురయ్యారు. 

ఇక, పై ఫొటో చూశాక షాక్‌ తినకుండా వుండగలమా.? ఫొటోలో వున్నదెవరో కాదు, సెక్సీభామగా కన్నడ, తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో గ్లామర్‌ విరగ పండించేసిన సంజన. 'బుజ్జిగాడు' సినిమాతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ, తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా స్టార్‌ హీరోయిన్‌ అవలేకపోయిందనుకోండి.. అది వేరే విషయం. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో నటించేస్తున్నానోచ్‌.. అని చెప్పుకుందిగానీ, ఆ సినిమాలో ఆమె పాత్రని వెతుక్కోవాల్సిందే ఎవరైనా. 

ఇంతకీ, పై ఫొటో ఏ సినిమాలోనిది.? అనే కదా మీ డౌట్‌.? ఇది 'దండుపాళ్యం-2' సినిమాలోనిది. గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా మంచి విజయాన్నే అందుకుంది. విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'దండుపాళ్యం-2'లో సంజన, ఇదిగో.. ఇలా గ్లామర్‌ అస్సలేమాత్రం లేకుండా కన్పించింది. టూ పీస్‌ బికినీలో గ్లామర్‌ ఒలక బోసిన సంజనని, ఇలా చూడటం కష్టమే. కానీ, సంజన మాత్రం తనకు ఇదొక ఛాలెంజింగ్‌ రోల్‌ అని చెబుతోంది. 

ఛాలెంజింగ్‌ సరే, ఈ సినిమాతో సంజనని హీరోయిన్ల లిస్ట్‌ లోంచి ఆడియన్స్‌ తీసెయ్యరు కదా.? క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆమెను లెక్కేసెయ్యరు కదా.? ఇవే ప్రశ్నలు ఆమె ముందుంచితే, 'దండుపాళ్యం-2' చూశాకే, తాను ఆ సినిమాలో అలా కన్పించడం కరెక్టో కాదో ప్రేక్షకులు డిసైడ్‌ చేస్తారనీ, తనకు ఖచ్చితంగా మంచి మార్కులు పడతాయనీ అంటోందట సంజన.

Show comments