వెంకయ్య నాయుడు ప్రధానమంత్రా?!

సమావేశాలు జరిగిన ప్రతిసారీ లోక్ సభలో రాజ్యసభలో ఇదో రొటీన్ కొశ్చన్. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, తెరాస తరపు నుంచి ఇదే ప్రశ్న పడుతూ ఉంటుంది. మా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నారా లేదా? విభజన చట్టంలో ఆ ప్రతిపాదన ఉంది కదా.. అని అంటూ ఉంటారు. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఒకేమాట.. లేదు, పెంచే ప్రతిపాదనలేదు, 2026 వరకూ అలాంటి ఆలోచనే లేదు.. సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం, అదంతా ఇప్పుడు కుదిరేపని కాదు.. అని కేంద్ర హోంశాఖ నుంచి సమాధానం వస్తూ ఉంటుంది.

అయితే ప్రతి సీజన్ లోనూ తెరాస, తెలుగుదేశం వైపుల నుంచి ఇదే ప్రశ్న వస్తూ ఉంటుంది. తాజాగా కూడా వచ్చింది. నిన్న సభలో ఇదే ప్రశ్న అడిగారు.. దానికి హోంశాఖ పాత సమాదానమే ఇచ్చింది. ఆ ఆలోచనలేదు, కుదరదు అని స్పష్టం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగమైన హోంశాఖ నుంచి పార్లమెంటులో ఈ సమాధానం రాగా.. అబ్బే, ఆ మాటను లెక్క చేయనక్కర్లేదని పార్లమెంటు బయట పల్లవి అందుకున్నాడు వెంకయ్య నాయుడు. తమ ప్రభుత్వంలోని తన సహచర మంత్రి, తన శాఖకు సంబంధించిన సమాచారాన్ని సభ ముందు ఉంచితే.. దానికి విలువ లేదన్నట్టుగా మాట్లాడారు వెంకయ్య.

ఏపీ, తెలంగాణల్లో సీట్లు పెరుగుతాయని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ దగ్గర నోట్ రెడీ అయ్యిందన్నారు. మరి సభలో హోం మినిస్ట్రీ సహాయమంత్రి.. పెంచే యోచన లేదంటే, సభ బయట ఆ శాఖతో ఎలాంటి సంబంధం లేని వెంకయ్యా.. హోం మినిస్ట్రీ దగ్గర నోట్ ఉంది అని అంటున్నారు.

మరి ఇక్కడ వెర్రోళ్లు ఎవరు? హోం మినిస్ట్రీనా.. ఆ శాఖ సహాయ మంత్రి కన్నా వెంకయ్య ఎక్కువ? లేక వెంకయ్య హోం మినిస్టరా అదీ గాక ప్రధానమంత్రా? ఇవన్నీ ఎలాగూ కాదని చెప్పనక్కర్లేదు. జస్ట్ సీట్ల పెంపు విషయంలో తన మీదే భారమేసిన.. కేసీఆర్, బాబులను ఊరడించడానికి వెంకయ్య ఈ మాటలు చెబుతున్నాడని స్పష్టం అవుతోంది. హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా మరో మంత్రి మాట్లాడటం ఏమిటో!

Show comments