పవన్ రాజకీయ లక్ష్యం అదేనా…?

ఉత్తరం, దక్షిణం.. ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూ  తిరుగుతున్నాయి పవన్ కల్యాణ్ ట్వీట్లు. బహుశా వేర్పాటు వాదాన్ని నమ్ముకుంటే… సౌతిండియా మొత్తం వెలిగిపోవచ్చని లెక్కేస్తున్నాడా? కేసీఆర్ వంటి వాళ్లను ఆదర్శంగా తీసుకున్నాడా? మరో రాజ్ ఠాక్రే అవుదామని అనుకుంటున్నాడా? ఇప్పుడు పవన్ కల్యాణ్ ట్విటర్ లో “వేర్పాటు వాదం’’ అనే మాట ప్రయోగించడంతో.. ఈయన హిడెన్ అజెండాతో ఏమీకాదు, ఉత్తర భారతం- దక్షిణ భారతదేశం అంటూ తన రాజకీయ మనుగడను వెదుక్కొంటున్నాడేమో అనే అభిప్రాయం కలగకమానదు.

ఏదో ఒకసారి ఉత్తర భారతీయులు దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారు  అంటే... సవాలక్ష సమస్యలతో పాటు దాన్ని  కూడా ప్రస్తావించాడులే అనుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. ప్రతిసారీ, సందర్భం లేకపోయినా ఈ అంశం గురించినే ప్రస్తావిస్తున్నాడు. మొన్నామధ్య ఎవడో బీజేపీ మాజీ ఎంపీ ఒకడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి పవన్ కల్యాణ్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అది అయిపోయిందని అనుకుంటే.. మళ్లీ ఉత్తరభారతదేశ నేతలు దక్షిణాది సంస్కృతుల్ని గౌరవించాలని పవన్ ట్విటర్లో సూచనలు చేసుకొచ్చాడు! వైవిధ్యాన్ని గౌరవించకపోతే.. వేర్పాటు వాద ఉద్యమాలకు ఊతమిస్తున్నట్టే అని పవన్ చెప్పుకొచ్చాడు.

దేవుడి దయవల్ల ఇంకా.. దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఈ దేశంలో ఇంకా అంతగట్టిగా వినిపించలేదు. దక్షిణాదిన ప్రత్యేక దేశ ఉద్యమాలేవీ అంత ప్రచారానికి నోచుకోలేదు. ఇలాంటి వాణి వినిపించి ప్రచారాన్ని పొందుదామనుకున్న వారెవరికీ ప్రజాదరణ దక్కలేదు. ఆఖరికి తమిళనాడును ప్రత్యేకదేశంగా ప్రకటించుకుందామని పెరియార్ రామసామి నాయకర్ అంటే దాన్ని ఆయన అనుచరులే వ్యతిరేకించారు. డీకే వ్యవస్థాపకుడు అయిన పెరియార్ ను ఆయన అనుచరులు అన్నాదురై వంటి వాళ్లు వ్యతిరేకించి డీఎంకేను పెట్టుకోవడానికి కారణం ప్రత్యేక దేశం కావాలన్న పెరియార్ ఆలోచనలే!

ద్రవిడవాదం విషయంలో పెరియార్ ఆలోచనలకు గౌరవం ఇచ్చారు కానీ.. ప్రత్యేక దేశం అనగానే, అంత తీవ్రద్రవిడ వాదులే ఒప్పుకోలేదు. పెరియార్ లాంటి పెద్దమనిషి చెబితేనే దానికి విలువ లేకుండా పోయింది.. మరి పవన్ కల్యాణ్ ఏ ధైర్యంతో “వేర్పాటు వాదం” అనే పెద్ద పదాన్ని ఉపయోగిస్తున్నాడో అర్థంకావడం లేదు. ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలతో కొందరికి రాజకీయంగా కలిసొచ్చే సరికి.. పవన్ కల్యాణ్ కూడా అదేదో బాగుందని.. ప్రత్యేక దేశం కావాలనే ఉద్యమం స్టార్ట్ చేసేలా కనిపిస్తున్నాడు.

ఎలాగూ తను బావిలో దూకమన్నా దూకేందుకు రెడీగా ఉన్న సినీఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రజల మధ్య వేర్పాటువాద చిచ్చు పెట్టడం చాలా సులభమైన పని. దానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ వేర్పాటువాద విషాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా క్రమంగా ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. తప్పేంలేదు.. ఎవడి రాజకీయ మనుగడ కోసం వాడొక అంశాన్ని ఎత్తుకోవాలి. క్రమంగా వాళ్లే హీరోలు అవుతారు. ఒక బాల్ ఠాక్రే, మరో రాజ్ ఠాక్రే, ఇంకో కేసీఆర్.. వీళ్లందరి జీవితాలే పవన్ కు ఆదర్శాల్లాగా ఉన్నట్టున్నాయి. వాళ్లు భాష, ప్రాంతం అన్నారు.. పవన్ ఉత్తరం, దక్షిణం అంటున్నాడు.

Show comments