అనుచిత వ్యాఖ్యలు.. బాబుపై సీఐఏ దృష్టి?

అనుచితంగా మాట్లాడటం బాగా అలవాటుగా మారింది తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. కోడలు మగబిడ్డను కంటానంటే.. అత్త వద్దంటుందా, ఎస్సీల ఇళ్లల్లో ఎవరు పుట్టాలనుకుంటారు? అనే మాటలతో మొదలుపెడితే.. తన గొప్పలు చెప్పుకోవడం గురించి, అసహనం వ్యక్తం చేయడం గురించి అనుచితమైన మాటలు మాట్లాడటం బాబుకు అలవాటుగా మారింది. అయితే ఆయన చట్టాలన్నింటికీ అతీతుడిలా చెల్లిపోతూ ఉండటం, అయ్యప్పస్వామి మాలధారణను, గుళ్లలో సమర్పించుకునే కానుకల విషయంలో కూడా దారుణమైన వ్యాఖ్యానాలు చేసినా.. బాబుకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేకుండాపోయారు.

వెనుకటికి ఇలాంటి మాటలు మాట్లాడే బిహార్ లో జీతన్ రామ్ మాంఝీ సీఎంపదవి పోగొట్టుకున్నారు. అయితే బాబు పార్టీకి బాబే బాస్ కాబట్టి... ఆయనకు మళ్లీ ప్రజాతీర్పు వచ్చే వరకూ ఇబ్బందులు ఏమీలేదు. కానీ.. బాబు మాటలు హద్దులు, సరిహద్దులు దాటుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆయన మాట్లాడుతున్న మాటలపై  ఇప్పుడు విదేశాలు కూడా దృష్టిసారిస్తున్నాయి.

ఇటీవల అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద విరుచుకుపడ్డారు. అమెరికాలో ఎవరికీ భద్రతలేకుండా పోయిందని, దానికి ట్రంపే కారణం అని.. అమెరికాలో విధ్వేషాలు రగిలేలా చేస్తున్నాడని, ఏపీలో జగన్ కూడా ట్రంప్ ను ఆదర్శంగా తీసుకున్నాడని.. బాబు వ్యాఖ్యానించారు. మరి జగన్ ను విమర్శించాలనుకుంటే ఆ విషయంలో బాబుకు సర్వహక్కులూ ఉండవచ్చు. కానీ.. అమెరికా అధ్యక్షుడి విషయంలో ఇలాంటి మాటలు తగవు.

వ్యక్తిగత హోదాలో బాబు ట్రంప్ విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని అయినా కలిగి ఉండవచ్చు.. కానీ, మంచోడో చెడ్డోడో.. ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడు. అందునా.. అమెరికా అధినేత. అలాంటి  వ్యక్తి విషయంలో ఒక రాష్ట్ర సీఎం అనుచితంగా మాట్లాడటం తగిన పని కాదు. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసే పని ఇది. యూఎస్ లో జాత్యాహంకార దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. జాగ్రత్తగా ఉండమని భారతీయులను హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప అమెరికాకు వెళ్లొద్దని సూచించింది. అంతేకానీ.. టక్కున ట్రంప్ పై విరుచుకుపడి పోలేదు. 

ఎలాంటి దేశంతో అయినా కొంత దౌత్యనీతి ఉంటుంది. దానికి లోబడే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే బాబుగారు మాత్రం అలాంటి పరిమితులు దాటారు. జగన్ పై విమర్శలు చేసుకోవడానికి తన మేధోతనాన్ని అంతా ఉపయోగించేశాడు. ట్రంప్ ప్రస్తావన తెచ్చి.. ఆయనపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. టీవీనైన్ వాళ్లతో, ఎన్టీవీ వాళ్లో.. తెల్లకొవ్వు, శ్వేతనాగు.. అంటూ ట్రంప్ ఫొటో పెట్టి తమ పైత్యాన్ని అంతా చూపించినా అడ్డుకునేవాళ్లు లేకపోవచ్చు. 

కానీ.. బాబు రియాక్ట్ అయిన తీరు గురించి సమాచారం అందుకున్నఅమెరికా నిఘా సంస్థ సీఐఏ బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలను సేకరించుకున్నట్టుగా తెలుస్తోంది. తమ దేశ అధ్యక్షుడి విషయంలో బాబు ఇలా అనుచితంగా ఎందుకు మాట్లాడారు? హద్దులు దాటి మాట్లాడిన బాబు తదుపరి వ్యవహారాలపై కూడా సీఐఏ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయినా.. అనుచితంగా మాట్లాడటానికి ఇది అయ్యప్పస్వాముల గురించి కాదని, ట్రంప్ గురించి మాట్లాడే ముందు చంద్రబాబు ఒకసారి ఆలోచించుకోవాల్సింది.

Show comments