'అమ్మ' కోసం జైలుకెళ్ళొచ్చు కదా.!

తమిళనాడులో 'అమ్మ వారసత్వం' కోసం పోరాటం కొనసాగుతూనే వుంది. వారసత్వం సంగతెలా వున్నా, శశికళ వర్గానికి అధికారమైతే దక్కేసింది. అఫ్‌కోర్స్‌, అధికారం కోసం ఆశపడ్డ శశికళకు, భంగపాటు ఎదురవడం.. ఆమె జైలుకెళ్ళడం జరిగిపోయాయనుకోండి.. అది వేరే విషయం. అయినా, 'అమ్మ వారసత్వం' కోసం పోరాటమైతే ఆగలేదు.. కొనసాగుతూనే వుంది.. కొనసాగుతూనే వుంటుంది. 

జయలలిత మేనకోడలు దీప కొత్త పార్టీ పెట్టారు. జయలలిత నమ్మిన బంటు, భక్తుడు కూడా అయిన పన్నీర్‌ సెల్వం తృటిలో ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకుని, ఇప్పుడు ఆ పదవి కోసం పడరాని పాట్లూ పడుతున్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదాట ఆయనకి. ఈ విషయం ఆయనే స్వయంగా చెబుతున్నారు. అన్నాడీఎంకే పార్టీని కైవసం చేసుకోవడం, తద్వారా అధికార పీఠమెక్కడం.. ఇదే ఆయన లక్ష్యం. అయితే, 'అమ్మ డీఎంకే' పేరుతో ఓ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఆయన చేస్తున్నారన్న ప్రచారం మామూలే.! 

ఇక్కడ, అందరికీ 'జయలలిత వారసత్వం' కావాలి. వారసత్వమంటే అధికారం.. అంతే.! అది తప్ప, జయలలితకు గతంలో న్యాయస్థానం విధించిన జైలు శిక్షగానీ, ఇంకొకటిగానీ వారసత్వంగా తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇక్కడ, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారంటే, అక్రమాస్తుల కేసులో ఆమె కూడా దోషి గనుక. 'అమ్మ' కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటున్న శశికళ కూడా, అమ్మకి తనతోపాటు విధించిన జైలు శిక్షను అదనంగా తానూ అనుభవిస్తానని ఆమె చెప్పలేరు. పన్నీర్‌ సెల్వం, దీప సంగతి సరే సరి. మేనల్లుడు దీపక్‌ పరిస్థితి కూడా అంతే. 

జయలలిత న్యాయస్థానానికి చెల్లించాల్సిన జరీమానా 10 కోట్లు ఎవరు చెల్లిస్తారు.? అన్న ప్రశ్నకే దీప సమాధానం చెప్పలేదాయె. దీపక్ అయితే, జయలలిత ఆస్తులమ్మేసి జరీమానా కట్టేస్తానని పెద్ద కథ విన్పించాడు. శశికళ నాయకత్వంలో నడుస్తోన్న అన్నాడీెంకే నేతలు ఈ ప్రశ్నకి మొహం చాటేస్తూనే వున్నారు. జయలలిత జీవించి లేరు గనుక, ఆ మొత్తం చెల్లించాల్సిన పనిలేదు.. జైలు శిక్షకీ ఛాన్స్‌ లేదు. కానీ, నైతిక కోణంలో చూస్తే, వారసత్వం కోసం ఆరాటపడేవారు.. అమ్మ కోసం ఆ మాత్రం చెయ్యలేరా.? ఇది తమిళనాడు ప్రజానీకం సంధిస్తున్న ప్రశ్న. తమిళ రాజకీయ సంక్షోభానికి పూర్తిగా తెరపడలేదింకా. నియోజకవర్గాలకు వెళుతున్న శశికళ వర్గం ఎమ్మెల్యేల్ని జనం ప్రశ్నిస్తున్నారు.. అదే సమయంలో, పన్నీర్‌ వర్గానికీ షాక్‌లు తగులుతున్నాయి. ఇవన్నీ చూస్తోంటే, ముందు ముందు మరోసారి తమిళనాడులో రాజకీయ సంక్షోభం తప్పనిసరన్పించడం ఖాయం.

Show comments