ఔరారా.. కాషాయవాదులు కాంగ్రెస్ వేలితో కాంగ్రెస్ నే!

నోరున్నోడిదే రాజ్యం… వీరి నోళ్ల నుంచి వచ్చే శబ్దాలను హైలెట్ చేసే మీడియా మౌత్ పీస్ సాయం కూడా ఉంటే.. ఇంకేముంది, ఎదుటి వేళ్లతో వాడి కంట్లోనే పొడచొచ్చు! ఆ తెలివి తేటలు కమలనాథుల దగ్గర దండిగానే ఉన్నాయి! లేకపోతే.. వీళ్లు ఎక్కడ నుంచి ఎక్కడకు వచ్చారో గమనిస్తే.. ఆశ్చర్యానికి అమ్మబాబుల్లాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి!

కాంగ్రెస్ వాళ్లకూ ఒక విధంగా తగిన శాస్తి జరిగినా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయంలో కమలం పార్టీ రాజకీయం చూస్తే మాత్రం, వామ్మో అనుకోవాల్సి వస్తోంది. రెండున్నరేళ్ల కిందట.. వల్లభాయ్ పటేల్ ను కొద్దిగా ఓన్ చేసుకున్న బీజేపీ ఇప్పుడు.. ఆయనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ను , నెహ్రూను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

నెహ్రూ వేస్ట్.. గాంధీ కుట్ర చేశాడు.. పటేల్ మాత్రమే నిఖార్సైన దేశ భక్తుడు, మిగతా వాళ్లందరూ స్వార్థ పరులే.. అని తమకు అనువైన భాష్యాన్ని చెప్పడానికి పటేల్ ను వాడేసుకోవడంలో కమలం పార్టీ చాతుర్యం పతాక స్థాయికి చేరిపోయింది! చరిత్రనంతా మార్చుకురావడానికి బీజేపీ పాట్లు పడుతోంది. ఆఖరికి పటేల్ కాంగ్రెస్ నేతనా లేకపోతే.. బీజేపీ ఫౌండరా! అని వికీపీడియాను చూసి చెక్ చేసుకోవాల్సి వస్తోంది.

ఇన్నేళ్లూ కాంగ్రెస్ పార్టీ పటేల్ పేరు ఎత్తకుండా ఒక రకమైన రాజకీయం చేస్తే, ఆ గ్యాప్ ను ఉపయోగించుకొంటూ, పటేల్ పేరుతో బీజేపీ ఇప్పుడు ఇంకో రాజకీయం చేస్తోంది! మహానుభావులను ఈ మరగుజ్జులు ఒక్కోరు ఒక్కో రకంగా వాడుకోవడం అనమాట. Readmore!

ఇంతజేసీ పటేల్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకి! నిజాంను అణిచాడని ఆయనను బీజేపీ, దాని బ్యాండ్ మీడియా హిందుత్వ వాదిగా చూపిస్తున్నా.. ఆర్ఎస్ఎస్ పై నిషేధాజ్ఞలు పెట్టిన వ్యక్తి కూడా ఆయనే! ఈ విషయంలో కమలం పార్టీ సూటిగా స్పందించదు. తమ మాతృసంస్థ పై పటేల్ నిషేధాజ్ఞాలు విధించిన విషయాన్ని మాట మాత్రమైన ప్రస్తావించడం లేదు! 

పటేల్ ను సమర్థుడని అంటూ, నెహ్రూను చేతగాని మనిషి.. అసమర్థుడు అని.. అనకనే అనేస్తున్నాడు మాన్య శ్రీ ప్రధానమంత్రి! పటేల్ కు పదవి దక్కలేదు.. అని మోడీజీ ఇప్పుడు వాపోతున్నారు! ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన భరితుడవుతున్నాడు.. పటేల్ నాయకత్వాన్ని దేశం కోరుకుంది అని మోడీ చెప్పుకురావడం బహువింత! పటేల్ పేరును ఇంతగా వాడుకొంటూ.. కమలం పార్టీ తాము ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నామని జాతికి చాటి చెబుతోంది.

పటేల్ ఏ నాడూ కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించిన నేత కాదు. తనకు ప్రధాని పదవి దక్కలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. ఆయన లేఖలే చెబుతున్నాయి. నెహ్రూని యువకుడు.. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు.. అని కీర్తించారు పటేల్. మరి అలాంటి మహత్ములను ఈ నాటి మరగుజ్జులు తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొంటూ ఉండటం.. వీళ్ల సిద్ధాంతాలను ఆదిలోనే వ్యతిరేకించిన వ్యక్తిని ఇప్పుడు ఓన్ చేసుకోవడానికి కాషాయవాదులు పడుతున్న తంటాలు.. వీరి భజంత్రీ మీడియా చేస్తున్న స్టంటులనూ గమనిస్తే.. నవ్విపోదురుగాక వీరికేటి.. అనిపించక మానదు!

Show comments