ఇర‌గ‌దీస్తున్న టీటీడీ ఈవో

ఆ మ‌ధ్య తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానం ఈవో నియామ‌కంపై రాష్ట్రంలో పెద్ద రాద్దాంతమే జ‌రిగింది. టీటీడీ ప‌రిపాల‌నాధికారిగా తొలిసారి ఒక ఉత్త‌ర‌భార‌త దేశ ఐఏఎస్ అధికారిని నియ‌మించ‌డాన్ని అటు రాజ‌కీయనేత‌లు, ఇటు ప్రాంతీయ సంఘాలు గ‌ట్టిగానే వ్య‌తిరేకించాయి. త‌న నియామ‌కంపై చెల‌రేగిన వివాదంపై నోరుమెద‌ప‌ని ఆ అధికారి త‌న ప‌నితీరు ద్వారా ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెబుతున్నాడు. తిరుమ‌ల కొండ మీద వీఐపీ విలాసాలు, ప్రాధామ్యాల‌కు చెక్ పెట్టి భ‌క్తుల మ‌న్న‌న‌లు పొందుతున్నాడు.

తిరుమ‌ల కొండ‌పై వీఐపీ భోగాల విష‌యంలో ప్ర‌జ‌ల్లో ఉండే అసంత‌ప్తి తెలిసిందే. వేస‌వి ర‌ద్దీ రోజుల్లో కూడా వీఐపీ ద‌ర్శ‌నం పేరుతో మంత్రులు, ఎంపీలు, ఉన్న‌తాధికారుల సిఫార్సుల లేఖ‌ల‌తో నిత్యం వేల మంది స‌త్వ‌ర ద‌ర్శ‌నం కోసం ఒత్తిడి తెస్తుంటారు. దీనిపై భ‌క్తుల్లో నిర‌స‌న‌లు వ‌చ్చినా రాజకీయ వ‌త్తిళ్ల వ‌ల్ల టీటీడీ పాల‌నా విభాగం వీఐపీ ద‌ర్శ‌నాల‌ను పూర్తిగా అడ్డుక‌ట్ట వెయ్య‌లేక‌పోయింది.

అయితే తాజా ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామ‌కం త‌ర‌వాత ప‌రిస్థితి మారిపోయింది. వీఐపీ ద‌ర్శ‌నాల‌కు పూర్తిగా నిలిపేశారాయ‌న‌. ఎంత వారైనా అంద‌రితోపాటు క్యూలో నిల్చోవాల్సిందే త‌ప్ప ఎలాంటి అద‌న‌పు మ‌ర్యాద‌లు ఉండ‌వ‌ని తేల్చేశారు. దీంతో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌గా వీఐపీలు మాత్రం ఆగ్రహం చెందుతున్నారు. 

కోస్తాకు చెందిన ఓ మంత్రి సోద‌రుడి కుటుంబం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చి వీఐపీ ద‌ర్శ‌నం కోసం కోరితే అధికారులు తిర‌స్క‌రించారు. స్వ‌యానా మంత్రి ఫోన్ చేసి చెప్పినా ఈవో త‌లొగ్గ‌లేదు. దీంతో స‌ద‌రు వీఐపీ కుటుంబం సాధార‌ణ లైన్లో నిల్చోవాల్సివ‌చ్చింది. అంత‌కుమందు మ‌రో వీఐపీ కుటుంబం స‌త్వ‌ర ద‌ర్శ‌నం ఇవ్వ‌నందుకు ఈవో కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేసినా సింఘాల్ చ‌లించ‌లేదు. అంతేకాక భ‌క్తుల సౌక‌ర్యాల విష‌యంలో ఆయ‌న చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

వేస‌వి ఎండ‌ల‌కు ఇబ్బంది లేకుండా చ‌లువ పందిళ్లు వేయ‌డం, చ‌ల్ల‌ని పానీయాలు అందుబాటులో ఉంచ‌డం తోపాటుగా కొండ‌పై స్వ‌చ్ఛ భార‌త్ నిర్వ‌హ‌ణ‌కు న‌డుంబిగించార‌ట‌. చిన్న‌పాటి అవినీతి, అసాంఘీక సంఘ‌ట‌న‌లు జ‌రిగినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సిబ్బందికి హెచ్చరించార‌ట‌.

నిత్యం ప‌రిపాల‌న విభాగాల్లో ప‌ర్య‌టిస్తూ అధికారులు, ఉద్యోగులు స‌క్ర‌మంగా ప‌నిచేస్తున్నారో లేదో చెక్ చేస్తున్నార‌ట‌. దీంతో ఇన్నాళ్లు మ‌నోళ్లు చేయ‌లేని ప‌ని ఒక ఉత్త‌ర భార‌త అధికారి చేస్తున్నాడ‌ని టీటీడీలో చ‌ర్చించుకుంటున్నారు. ఎవ‌రైతే ఏంటి పాల‌న‌ బాగుండ‌డ‌మే కదా కావాల్సింద‌ని భ‌క్తులు అనుకుంటున్నారు.

Show comments