ఇప్పుడు చూస్తున్నది తెలంగాణ సినిమా

టాలీవుడ్ అంటే ఆంధ్ర, ఆంధ్ర అంటే టాలీవుడ్ అనుకున్నారు నిన్నటి వరకు.   ఇప్పుడు కూడా అలాగే వుంది కానీ, టాలీవుడ్ లోకి పెట్టుబడులు ఎక్కువగా తెలంగాణ లోంచి వస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆంధ్రలో బ్లాక్ మనీ లేదా వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బులు ఎక్కువగా రియల్ ఎస్టేట్ లోకి వెళ్తుంటే, తెలంగాణలో ఇలాంటి బాపతు డబ్బులు అన్నీ సినిమాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.  

సాధారణంగా పొద్దుటూరు, ధర్మవరం, విజయవాడ జనాలు సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు వీరంతా బాగా తగ్గించారని వినికిడి. వివిధ సినిమాల్లో వీరి డబ్బులు బ్లాక్ కావడమో, మొండి బాకీలుగా మారడమో ఇందుకు కారణం. పైగా రాను రాను ఆంధ్ర జనాల దృష్టి అంతా రియల్ ఎస్టేట్ మీదకు ఎక్కువగా మళ్లింది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ కు దగ్గరగా వుండే తెలంగాణలోని రాజకీయ వేత్తలు లేదా వారి ఆశ్రితులు తమ తమ ఎక్సెస్ మనీని తెలుగు సినిమాలకు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. 

సినిమా నిర్మాణం, పంపిణీ, ఇంకా అనేక అనుబంధ వ్యాపారాలకు ఈ తరహా డబ్బు అందుతున్నట్లు టాక్ వుంది. ఎప్పుడైతే రెగ్యులర్ ఫైనాన్సియర్లు వ్యాపారం తగ్గించారో, తెలంగాణ జనాలకు అవకాశాలు కూడా పెరిగాయి. అయితే ఇలా ఫైనాన్స్ చేస్తున్న లేదా వెనుక నుంచి సాయం చేస్తున్నవారు ఎక్కువగా చిన్న సినిమాలనే ఎంచుకుంటున్నారట. రెండు మూడు కోట్ల నుంచి పది కోట్ల లోపు సినిమాలకు సాయం అందిస్తున్నారట. దీనివల్ల రిస్క్ తక్కువ వుంటుంది. 

పైగా చిన్న సినిమాలు తీసే కొత్త, మిడిల్ రేంజ్ నిర్మాతలు ఎగ్గొట్టడానికి కాస్త మార్గాలు తక్కువ. వీరిలో ముదుర్లు, దేశ ముదుర్లు తక్కువగా వుంటారు. మరీ తోక జాడిస్తే రాజకీయం అండ ఎలాగూ వుంటుంది. ఇలాంటి ఫైనాన్స్ చేస్తున్నవారిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు వున్నారని వినికిడి. అయితే ఒకటి రెండు రాజకీయ కుటుంబాలైతే కాస్త భారీగానే నిధులను సినిమా రంగంలొకి పంప్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.  Readmore!

ఈ కుటుంబాలు కొన్ని సంస్థలను ఎంచుకుని కాస్త భారీగానే నిధులను పంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెల్లగా స్టార్ట్, చేసి, ఇండస్ట్రీ ఆనుపానులు తెలుసుకుని, దానిపై గ్రిప్ వచ్చిన తరువాత ఫుల్ ఫ్లెజ్డ్ గా పెట్టుబడులు పెట్టే దిశగా ఈ కుటుంబాలు ప్లానింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. బహుశా ఈ ప్రణాళికలన్నీ సజావుగా ఫలితాలు ఇస్తే, మరో  అయిదారేళ్లలో టాలీవుడ్ రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది. 

Show comments