అధికారానికి 'ఉచితాలు' దగ్గర దారి...!

మన దేశాన్ని ఒక విషయంలో కొన్ని దేశాలవారు మెచ్చుకుంటారు. ఎందుకు? ఇక్కడ ప్రజాస్వామ్యం చక్కగా ఉందని, అసెంబ్లీలకు, పార్లమెంటుకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతుటాయని, ఇరుగుపొరుగు దేశాల్లో మాదిరిగా సైనిక తిరుగుబాట్లు జరగవని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి నియంతలు అధికారం చేపట్టే అవకాశం లేదని...ఇలాంటి అనేక కారణాల వల్ల భారత్‌ మంచి ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు పొందుతోంది. ఇది నిజమే అయినా మన ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిపోయిన విషయం విదేశీయులు గుర్తించారో లేదో తెలియదు. 

ఇండియన్‌ డెమొక్రసీ మేడిపండు చందంగా తయారైంది. దాని పొట్ట నిండా చాలా పురుగులున్నాయి. దాదాపుగా అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. క్రమంగా ప్రజలూ దిగజారుతున్నారు. ఎన్నికల్లో పార్టీల సిద్ధాంతాలను చూసి, విధానాలను అధ్యయనం చేసి, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఓట్లేయడం ఎప్పుడో మానేశారు. అలాగని ప్రజలు విజ్ఞతగా వ్యవహరించడంలేదని చెప్పలేం. పాలకులకు 'కీలెరిగి వాత పెడుతున్న' సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక ప్రభుత్వం మరీ భ్రష్టుపట్టిపోయిందనే అభిప్రాయం కలిగితే ఎన్నికల్లో దానికి నూకలు చెల్లించి మరో పార్టీని అధికారంలోకి తెస్తున్నారు. ఇందుకు గత పార్లమెంటు ఎన్నికలను తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా దక్కనీయకుండా చేసి, బీజేపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు. రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీలో భూస్థాపితం చేశారు. అయినప్పటికీ దాదాపుగా అన్ని పార్టీలు ఓటర్లను బిచ్చగాళ్ల స్థాయికి దిగజార్చాయని చెప్పుకోవచ్చు. ఓటర్లు కూడా చైతన్యం కోల్పోయి నాయకుల ప్రలోభాలకు లొంగిపోతున్నారు. ఇప్పటి నాయకులెవరూ తమ పార్టీ విధానాలను వివరించి, అభివృద్ధికి సంబంధించి తమ 'విజన్‌' విశదీకరించి ఓట్లు అడగట్లేదు. తాత్కాలిక బహుమతులను ఎర చూపి, ఉచిత పథకాలను ఊదరగొట్టి, ప్రజలను అడక్కునేవారిగా ట్రీట్‌ చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే వస్తున్నారు కూడా. 

కొందరు నాయకులు ఉచిత పథకాలు, తాయిలాలు, బహుమతులు ప్రకటించడంలో శిఖరాగ్రానికి (పీక్‌ స్టేజ్‌) వెళ్లిపోయారు. వారి 'ఉచితాలు' చూస్తే ప్రజాస్వామ్యం ఇంత చీపైపోయిందా? ఓటర్లను ఇంత సులభంగా బుట్టలో వేసుకోవచ్చా? అనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ ఈ విషయంలో తమిళనాడు ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేదే హవా కదా...!  ఉచితాలు ప్రకటించడంలో ఆ రెండు పార్టీల అధినేతలకు అడ్డూఅదుపు లేదు. ఉచిత పథకాలు ప్రకటించకూడదని, తాయిలాలు ఇవ్వకూడదని రాజ్యాంగం నిబంధన విధించలేదు కదా....!  Readmore!

కాబట్టి ఈ విచ్చలవిడితనాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదు. ఏ రాష్ట్రంలో ఎలాంటి ఉచిత పథకాలు, తాయిలాలు ప్రకటిస్తున్నారో అన్ని రాష్ట్రాల్లోని పార్టీల నాయకులు గమనిస్తుంటారు. కొన్నింటిని వారు కాపీ కొడతారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలు ఎప్పటిమాదిరిగానే 'ఉచిత' బాటలోనే నడిచాయి. అన్నాడీఎంకే అధినేత జయలలిత విజృంభించి ఉచిత పథకాలు, తాయిలాలు ప్రకటించడంతో ఓడిపోతుందని ప్రచారం జరిగిన ఆమె విజయం సాధించి సింహాసనం ఎక్కింది. ఉచితంగా  మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పెళ్లి కూతుర్లకు బంగారం, తక్కువ ధరలో పాలు, అమ్మ బ్యాంకింగ్‌ కార్డు, ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ...ఇలాంటివి బొచ్చెడున్నాయి. 

2006లో కరుణానిధి ఉచితంగా టీవీ సెట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజాధనాన్ని ఈ విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లజ్జగా వాడుకుంటున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఉత్తర ప్రదేశ్‌లోనూ నాయకులు 'ఉచిత' పాట పాడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి అఖిలేష్‌ పాడారు. 'అమ్మ' ఉచిత సెల్‌ఫోన్ల పథకం ఆయనకు నచ్చినట్లుంది. ఏదాదికి 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారందరికీ అధికారంలోకి రాగానే ఉచితంగా అత్యాధునిక సెల్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటినుంచే ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

ఎస్‌పీ అధికారంలోకి వస్తే 2017 ద్వితీయార్ధంలో ఈ సెల్‌ఫోన్లను లబ్ధిదారుల ఇళ్లకే డెలివర్‌ చేస్తారు. ప్రస్తుతానికి ఇదో పథకం. ఇంకా కూడా ప్రకటించొచ్చు. గత ఎన్నికల్లో (2012) అఖిలేష్‌ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్స్‌ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చారు అధికారంలోకి రావడానికి ఇదొక్కటే కారణం కాదు. అయినప్పటికీ దాని ప్రభావం ఉంటుంది. గత ఎన్నికల్లో ఏపీలో వివిధ వర్గాలకు రుణ మాఫీ వాగ్దానం చంద్రబాబును అధికారంలోకి తెచ్చింది కదా. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ కూడా ఎందుకైనా మంచిదని ఉచితాలు ప్రకటించారు. 'ఉచితం' ప్రకటించేటప్పుడు బాగానే ఉంటుంది. అమలు చేయాలనేసరికి తల బొప్పి కడుతుంది.

Show comments

Related Stories :