చైనా 'దంగల్‌' 1000 కోట్లు.. ఆ పైనేనట

'బాహుబలి ది కంక్లూజన్‌' ఓ తెలుగు సినిమా. హిందీలోకి, తమిళంలోకీ, ఇతర భాషల్లోకీ డబ్‌ అయ్యింది. ఓవరాల్‌గా అది 'ఇండియన్‌ సినిమా' అనే స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఆ స్థాయిలో 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలయ్యింది, అంచనాలకు మించి వసూళ్ళను అందుకుంది. బాలీవుడ్‌ సినిమా 'దంగల్‌' అంతకు ముందు సృష్టించిన రికార్డుల్ని తిరగరాసింది. 'దంగల్‌' విజయాన్ని మరుగున పడేసిన 'బాహుబలి ది కంక్లూజన్‌' వెయ్యి కోట్ల క్లబ్‌లోకీ, ఆ తర్వాత 1500 కోట్ల క్లబ్‌లోకీ చేరింది. 

'బాహుబలి ది బిగినింగ్‌' మేనియా దేశమంతా ఊపేస్తోన్న టైమ్‌లోనే, 'దంగల్‌' సినిమా చైనాలో విడుదలయ్యింది. దాంతో, 'దంగల్‌' గురించి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 100 కోట్లు, 200 కోట్లు.. అలా అలా 500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది చైనా వసూళ్ళకు సంబంధించి 'దంగల్‌' సినిమా. ఇది ఇండియాలో సాధించిన వసూళ్ళకు అదనం. తాజా లెక్కల ప్రకారం 'దంగల్‌' చైనాలో 650 కోట్ల మార్క్‌ని దాటేసిందట. అతి త్వరలో వెయ్యి కోట్ల మార్క్‌ని అక్కడే దాటేస్తుందన్నది బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితుల అంచనా. 

అవి డబ్బులు.. చిత్తుకాగితాలు కానే కావు. అయినాసరే, లెక్కలు మాత్రం నమ్మశక్యంగా లేవు. నమ్మలేని నిజమని బాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు 'దంగల్‌' వసూళ్ళ గురించి తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం 'బాహుబలి'కీ, 'దంగల'కీ మధ్య వ్యత్యాసం కేవలం 14 మిలియన్‌ డాలర్లేనట. అదెంత, రెండు మూడు రోజుల్లోనే 'క్లియర్‌' అయిపోతుందన్నది 'దంగల్‌' అభిమానుల వాదన. ఇంకోపక్క, 'బాహుబలి' అతి త్వరలో 2 వేల కోట్ల మార్క్‌ని టచ్‌ చేయొచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అంతకన్నా ముందే 'దంగల్‌' ఆ క్లబ్‌లో చేరిపోతుందట. ఏంటీ, ఇదంతా నిజమేనా.? ఏమో, ఆ ఫిగర్‌తో.. ఈ రెండు సినిమాలకీ సంబంధించిన 'అనౌన్స్‌మెంట్‌' వస్తుందేమో వేచి చూడాలి.

Show comments