నాన్నారూ.. ఉతికి ఆరేస్తున్నారూ.!

ఓ పక్క సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌ పిల్లిమొగ్గలేస్తోంటే ఇంకోపక్క, సోషల్‌ మీడియాలో చంద్రబాబుపైనా, ఆయన పుత్రరత్నం నారా లోకేష్‌పైనా 'పొలిటికల్‌ పంచ్‌'ల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. మరీ ముఖ్యంగా, లోకేష్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో 'పప్పు' అంటూ విరుచుకుపడ్తూనే వున్నారు. ఇదివరకటితో పోల్చితే, ఈ దాడి ఇప్పుడు మరింత తీవ్రమయ్యిందనే అనుకోవాలేమో.! 

జయంతి - వర్దంతి కన్‌ఫ్యూజన్‌, వైఎస్సార్సీపీని విమర్శించాల్సి వచ్చినప్పుడు.. తడబడుతూ టీడీపీని విమర్శించడం.. ఇవి చాలవన్నట్టు, వైఎస్‌ జగన్‌ని మాజీ ముఖ్యమంత్రిగా అభివర్ణించడం వంటి 'చిలిపి చేష్టలతో' నెటిజన్లకు కావాల్సినంత కామెడీ మెటీరియల్‌ని అందిస్తున్నారు మంత్రి నారా లోకేష్‌. ఇంకేముంది, ఆయనగారి అవగాహనా లేమి, అనుభవ రాహిత్యం.. ఇవన్నీ ఇప్పుడయాన కొంపముంచేస్తున్నాయి సోషల్‌ మీడియాలో. 

ఒకప్పుడు ఇదే ఇంటర్నెట్‌ని, ఇదే సోషల్‌ మీడియానీ తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్‌లో వాడేసుకుంది. ఇప్పుడు అదే సోషల్‌ మీడియా చినబాబుతో గట్టిగా ఆడేసుకుంటోంది. మంత్రిగా, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వున్నానన్పించుకునేందుకు, నెటిజన్లతో ఇంటరాక్షన్‌ అవుతున్న నారా లోకేష్‌కి, ఈ సెటైర్లు ఏమాత్రం రుచించడంలేదు. కానీ, ఏం చేస్తారు.? సోషల్‌ మీడియాని భయపెట్టేయడం ఆయన అనుకున్నంత తేలిక కాదు కదా.! 

ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగాలనకున్నా ఎంతమంది మీద ఆ పని చేయగలరు.? అధికారం చేతిలో వుంది కదా అని.. ఎంత మందిని అరెస్ట్‌ చేయగలరు.? సోషల్‌ మీడియాలో లోకేష్‌ పెట్టే ఒక్కో కామెంట్‌కీ వేల సంఖ్యలో స్పందనలొస్తున్నాయి. అందులో నూటికి 90 శాతానికిపైగా ఆయన్ని కడిగి పారేస్తున్నవే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వేసవిలో నీటి కష్టాల గురించి జనం ఏకరువు పెట్టేస్తున్నారు. వాటికి లోకేష్‌ ఏవేవో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక్కడా ఆయన్ని నెటిజన్లు వదిలిపెట్టడంలేదాయె.! ప్చ్‌ నారా లోకేష్‌.. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదేమో.?

Show comments