చంద్రనీతి: తిట్టేదెవరో.. తిట్టించేదెవరో.!

బీజేపీ, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమని చంద్రబాబుకి గుర్తుకొచ్చిందండోయ్‌.! 'బీజేపీ మనకి మిత్రపక్షం.. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో మనం భాగస్వాములం.. రాష్ట్రంలోని ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి.. అక్కడ మనకి కేంద్ర మంత్రి పదవులున్నాయి.. ఇక్కడ బీజేపీ నేతలకి రాష్ట్ర మంత్రి పదవులిచ్చాం.. ఆ విషయం మనం మర్చిపోకూడదు.. ఎన్నిసార్లు వారిస్తున్నా కొందరు హద్దులు మీరి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు..' అంటూ తాజాగా టీడీపీ నేతలకు క్లాస్‌ తీసుకున్నారు చంద్రబాబు. 

అరరె, ఎంతలో ఎంత మార్పు.? బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలుగు రాష్ట్రాల పర్యటన షురూ చేశాక, చంద్రబాబుకి తెలివొచ్చినట్లుంది. వున్నపళంగా, ఆయన బీజేపీ మీద విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేసేశారు. ఇంకెప్పుడూ, అలాంటి వ్యాఖ్యలు చేయరాదని అల్టిమేటం జారీ చేసేశారు. వావ్‌, ఇదంతా నిజమేనా.? అన్న అనుమానాలు టీడీపీ నేతలకే కలుగుతున్నాయి. 

అవును మరి, బీజేపీని టీడీపీ నేతలు తిడుతున్నారంటే, అది చంద్రబాబు అనుమతి లేకుండా జరుగుతున్న ప్రక్రియ.. అని ఎలా అనుకోగలం.? చాన్సే లేదు. అలా, టీడీపీ - బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పుడెప్పుడూ చంద్రబాబు కల్పించుకోలేదంటే, ఆయనే ఆ మొత్తం ఎపిసోడ్‌కి రూపకల్పన చేశారనే విషయం సుస్పష్టమవుతూనే వుంది. 

ఇక్కడ, బీజేపీ తక్కువేమీ తిన్లేదు. బీజేపీలో ఓ వర్గం టీడీపీకి వ్యతిరేకం. ఇందులో ఎక్కువమంది ఒకప్పటి కాంగ్రెస్‌ నేతలే వున్నారు. మరో వర్గం, టీడీపీకి అనుకూలం. వీళ్ళంతా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భజన బ్యాచ్‌ అన్న మాట. 

కొసమెరుపు: పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని చంద్రబాబు సెలవిచ్చారు. ఆ అధిష్టానం చంద్రబాబు కాకుండా ఇంకెవరన్నా వున్నారా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.

Show comments