లగడపాటి రీఎంట్రీ ఏ పార్టీ నుంచి?

గట్టిగా మాట్లాడితే సాధారణ ఎన్నికలకు రెండేళ్ల కంటే తక్కువ సమయమే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇరవైఒక్క నెలలు. అందుకే అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. పాలకుల పథకాలు, నిర్ణయాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉంటున్నాయి. కోటలు దాటుతున్న ప్రతిపక్షాల మాటలూ ఎన్నికలతోనే ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు నాయకులు తెరమరుగైపోయారు. ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఇలా తెరమరుగైన నాయకులు ఉద్దేశపూర్వకంగానే గమ్మున ఉండిపోయారు.

ముఖ్యంగా ప్రజల తిరస్కరణకు గురై, శూన్య హస్తాలతో మిగిలిన కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకుల్లో కొందరు తెర వెనక్కి వెళ్లిపోగా, ఇంకొందరు ఇతర పార్టీల్లో చేరారు. వారిలో ఎంతమంది మళ్లీ యాక్టివ్‌ అవుతారో చెప్పలేం. అది అప్పటి రాజకీయ పరిస్థితి బట్టి, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి ఉంటుంది. వచ్చే ఎన్నికలనాటికి మళ్లీ చురుగ్గా రీఎంట్రీ ఇస్తారని భావిస్తున్నవారిలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుపొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

విభజన సమయంలో పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే చేసి, పారిపోయి నిమ్స్‌ ఆస్పత్రిలో చేరి, అక్కడినుంచి తప్పించుకుపోయిన రాజగోపాల్‌ అప్పట్లో 'సినిమా చూపిస్త మామా' టైపులో సంచలనం కలిగించారు. విభజన జరిగితే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన ఈ మాజీ ఎంపీ అన్నమాట ప్రకారం పాలిటిక్స్‌కు దూరంగా ఉండిపోయారు.

అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాదిరిగా నోరు మూసుకొని కూర్చోలేదు. ఎన్నికల సర్వేలు చేయిస్తూ, నాయకుల జాతకాలు చెబుతూ 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరు తెచ్చుకున్నారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వేలు ఆషామాషీ కాదని, అవి నిజమవుతున్నాయనే అభిప్రాయం నాయకుల్లో, ప్రజల్లో కలిగింది. కాబట్టి  ఆయన అన్ని కోణాల నుంచి ఆలోచించి రీఎంట్రీ ఇస్తుండొచ్చు. మళ్లీ కాంగ్రెసులోనే చేరతారా? అనే ప్రశ్నకు కచ్చితంగా 'అవును' అని సమాధానం చెప్పలేం.

ఆయన రీఎంట్రీ ఇస్తున్నారంటే అది ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికల్లో పోటీ చేయడమే. అలా పోటీ చేయదగ్గ పార్టీని ఆయన ఎంపిక చేసుకోవల్సివుంది. ఎన్నో ఎన్నికల సర్వేలు నిర్వహించిన లగడపాటి ఏ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందో, ఏ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందో అంచనా వేసుకొని గెలిచే పార్టీలోనే చేరుతుండొచ్చు. లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా పనిచేయాలని అభిమానులు, అనుచరులు కోరుకుంటున్నారు.

ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తూ, స్వాగతం పలుకుతూ విజయవాడలో పలుమార్లు ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు వెలిశాయి కూడా. 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో కాంగ్రెసు పార్టీలోకి ప్రవేశించిన లగడపాటి రెండుసార్లు విజయవాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. విభజన జరిగేంతవరకూ కాంగ్రెసు పార్టీ నాయకుడిగానే ఉన్నారు. తరువాత తాను చేసిన ప్రతిజ్ఞ మేరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

అయితే 2019 ఎన్నికల్లో ఈ నాయకుడు టీడీపీ తరపున బరిలో (ఎంపీ లేక ఎమ్మెల్యే) ఉంటారా? ఈ అనుమానం కలగడానికి రాజగోపాలే కారణం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పలుమార్లు ఆయన్ని కలుసుకున్నారు. సమావేశాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం కలిగించారు. ఒకవేళ ఆయనకు టీడీపీలో చేరాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలనాటికి ఆ పార్టీకి ప్రజాదరణ ఎంత మేరకు ఉందో నిర్ధారించుకోనిదే చేరతారా? టీడీపీ అధికారంలోకి రాదని తేలినా అందులో చేరితే రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుంది.

చంద్రబాబును పలుమార్లు కలుసుకున్నంత మాత్రాన అందులోనే చేరతారని చెప్పలేమని కొందరు నాయకులు అంటున్నారు. టీడీపీలో రాజగోపాల్‌కు సన్నిహితులైన నాయకులు కొందరు ఆయన 2019 ఎన్నికల్లో రీఎంట్రీ ఇస్తారని, టీడీపీ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నారు. లగడపాటి వైఎస్సార్‌కు సన్నిహితుడు కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఆ అభిమానంతో వైకాపాలోకి రావచ్చని ఆ పార్టీ నాయకులు కొందరు ఆశ పడుతున్నట్లు సమాచారం. ఏదిఏమైనా పార్టీల జాతకాలు తెలుసుకున్న తరువాతే లగడపాటి రీఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు.

Show comments