ఆ విధంగా... పెద్దోళ్లను సేవ్ చేయడమైనది!

డ్రగ్స్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని ఏ రేంజిలో కుదిపేస్తున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా చాలా మందిని సిట్ అధికారులు విచారించడం పూర్తయింది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రాథమిక విచారణలు ఒక కొలిక్కి రానున్నాయి. ఇక్కడితో ఈ పర్వం ఆగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఈ విచారణ జరుగుతుండగానే.. ఇంకా అనేక డ్రగ్స్ వ్యవహారాలు బయల్పడడం, ఈ విచారణలోనూ, అంతకు మునుపూ వివిధ రంగాల్లోని ఇంకా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం జరిగింది. వారినందరినీ కూడా విచారించడం మిగిలుంది.

కానీ వారి విచారణ పర్వాన్ని అంతా.. గోప్యంగా, గుట్టుచప్పుడు కాకుండా.. ముగించేయడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన విచారణలో వచ్చిన వారు ఆవేదన చెందారనే అంశాన్నే సాకుగా చూపి.. ఇంకా విచారణ ఎదుర్కోవాల్సి ఉన్న పెద్దతలకాయలను కాపాడడానికి ఒక పథకం ప్రకారం ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ముందునుంచి సిట్ అధికారులు సినిమా రంగాన్ని టార్గెట్ చేశారంటూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమారంగంపై కన్నేయడం ద్వారా సిట్ లైమ్ లైట్ లోకి వచ్చిందంటూ రాంగోపాల్ వర్మ లాంటి వారు కూడా బోల్డ్ విమర్శలు అనేకం గుప్పించారు. సినిమా రంగానికి చెందిన వారంతా చాలా ఆవేదన వ్యక్తం చేశారు కూడా! అయితే ఇలాంటి విమర్శల్లో ఒక సహేతుకత కూడా ఉంది. కెల్విన్ ఫోన్ కాల్ డేటా నుంచి అనేక మంది పారిశ్రామిక, రాజకీయ, సినిమా ప్రముఖుల పేర్లు కూడా వెల్లడైనప్పుడు కేవలం సినీ రంగం వారిని మాత్రం పిలిచి విచారించడంలో ప్రామాణికత ఏంటి? అనేది ఎవ్వరికీ అంతు చిక్కని విషయం.

అలాగే.. సినీ రంగంలోనే పెద్దతలకాయలు అనేకం ఉన్నప్పటికీ.. సిట్ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా సిట్ మాటలను గమనిస్తే నిజమే అనిపిస్తోంది. ఇప్పటిదాకా జరిగిన విచారణ కొంత వివాదస్పదం అయినందున, ఇకమీదట జరిగే విచారణలు గోప్యంగా ముగించేస్తారట. ఇదేదో బుకాయింపుకోసం చెబుతున్నట్లుగా ఉంది. అందరూ అనుమానిస్తున్నట్లే జరుగుతోంది.

సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పెద్దలను పిలిచినా, రాజకీయ ప్రముఖులను కూడా డ్రగ్స్ కేసులో విచారించినా.. ఆ పర్వం మొత్తం గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతుందన్నమాట. అయితే గియితే అబ్కారీ ఆఫీసు వద్ద మీడియా కెమెరాలు పొంచి ఉంటాయి గనుక.. వారికి చిక్కకుండా.. కావలిస్తే అధికారులే వారి ఇళ్లకు వెళ్లి, రెండో కంటికి తెలియకుండా విచారణను ముగించేసి... రికార్డుల పరంగా అందరినీ విచారించేసినట్లుగా పేర్కొని మమ అనిపించేసినా ఆశ్చర్యం లేదని పలువురు సందేహిస్తున్నారు. ఆ రకంగా పెద్దోళ్లనంతా సేవ్ చేశారని అనుకుంటున్నారు. 

Show comments