కేంద్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటి రక్షణ మంత్రిత్వ శాఖ. పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులకే ఆ శాఖను అప్పగిస్తుంటుంది ఏ పార్టీ అధికారంలో వున్నాసరే. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మనోహర్ పారికర్.
తెలంగాణలో తాజాగా ఈయనగారు పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం చాలా బాగుందని కితాబిచ్చారు. కొందరు కలలు కంటారు.. కానీ నిద్రపోతారు. మంత్రి కేటీఆర్ అలా కాదు, కలల్ని సాకారం చేస్తున్నారు.. అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో తప్పేముంది.? అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నందున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించేందుకు అలా మాట్లాడాల్సిందే కదా.!
కానీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. హైద్రాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మనోహర్ పారికర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో వాస్తు పాలన సాగుతోందంటూ ఎద్దేవా చేసేశారు. అక్కడేమో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు.. ఇక్కడేమో అదే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు. వెరసి, బీజేపీ శ్రేణులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ ఢిల్లీ నేతల లొల్లి ఏందిరా బాబూ.? అంటూ షాక్ తిన్నారు బీజేపీ నేతలు.
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, అక్కడ ప్రసంగించి, ప్రశంసించాల్సి వచ్చినప్పుడు.. పార్టీ సమావేశాల్లో మాట్లాడే విషయమై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఒక చోట మౌనంగా వుండి, ఇంకోచోట స్పీచ్ ఇస్తే ఈ పరిస్థితి ఎదురు కాదు. అయినా, రక్షణ మంత్రి పనిగట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, విమర్శించడం అవసరమా.? అన్న వాదనకు ఆస్కారమివ్వడమంటేనే బీజేపీ, కొరివితో తలగోక్కున్నట్లు.
ఇక్కడ, మనోహర్ పారికర్.. టీఆర్‌ఎస్‌ని విమర్శించినా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా.. తెలంగాణలో బీజేపీని కన్‌ఫ్యూజన్‌లో పడేశారు. మరీ దారుణంగా బీజేపీ, మనోహర్ పారికర్ వ్యాఖ్యలతో నవ్వులపాలైపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!