వెంకన్నబాబుకే 'పిడి' పెట్టాలా స్వామీ.?

సుబ్రహ్మణ్య స్వామి అంటే ఓ సంచలనం. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి గురించి కొత్తగా పరిచయం ఏమీ అవసరం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను జైలుకు పంపిన ఘనుడీయన. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ముప్పు తిప్పలు పెడుతున్న పొలిటికల్‌ మొనగాడు. ప్రస్తుతం బీజేపీలో వున్న సుబ్రహ్మణ్యస్వామి, తనకు అలవాటుగా మారిపోయిన విద్యను, బీజేపీ మీద ప్రయోగిస్తున్నారు. 

ఆల్రెడీ సుబ్రహ్మణ్యస్వామి దెబ్బకి ఆర్‌బిఐ గవర్నర్‌ పదవిలో ఇంకోసారి కొనసాగే అవకాశం వున్నా 'నమస్కారం పెట్టి' వెళ్ళిపోతున్నారు రఘురామ్‌ రాజన్‌. మరికొందరు ముఖ్యులపైనా ఫోకస్‌ పెట్టిన సుబ్రహ్మణ్యస్వామి, తాజాగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిపై కన్నేశారు. అసలు, దేవాలయాలపై రాజకీయ పెత్తనం ఏంటి.? అని ప్రశ్నించేశారాయన. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించడం గమనార్హం. 

నిజమే మరి, దేవాలయాల మీద రాజకీయ పెత్తనమేంటి.? మరీ దారుణంగా సినిమా టిక్కెట్ల తరహాలో, దేవుడి దర్శనానికీ టిక్కెట్లు పెట్టి అమ్మేస్తున్నారు. బోర్డులు ఏర్పాటు చేసి, అందులో రాజకీయ నిరుద్యోగులకు ఆస్కారం కల్పిస్తున్నారు. గుడినీ, గుడిలోని లింగాన్నీ రాజకీయ నాయకులు మింగేస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. 'కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేం.. టీటీడీ ఛైర్మన్‌ గిరీ ఇస్తాం..' అనే స్థాయికి, రాజకీయ పార్టీలు దిగజారిపోయాయి. 

దేవుడికి సేవ చేయడం కాదు, ఆ సేవ పేరుతో దేవుడ్ని, భక్తుల్ని దోచేయడమే.. 'దేవాలయాల పాలన'గా మారిపోయిందిప్పుడు. ఈ పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యస్వామి న్యాయపోరాటం చేస్తే, దేవాలయాలకు పట్టిన రాజకీయ గ్రహణం వీడిపోయినా ఆశ్చర్యపోనక్క్కర్లేదు. అయితే, ప్రభుత్వం కాకుండా ధార్మిక సంస్థలు దేవాలయాల్ని నిర్వహించాలన్న సుబ్రహ్మణ్యస్వామి ప్రతిపాదన ఎంతవరకు కరెక్ట్‌.? ఇప్పుడు భక్తిని మించిన వ్యాపారం ఇంకొకటి లేదు. ప్రస్తుతం ప్రభుత్వం భక్తితో వ్యాపారం చేస్తోంది, ముందు ముందు ధార్మిక సంస్థలు ఆ పని చేస్తాయి.. అంతే తేడా.!

Show comments