జేసన్ ఎవరు.. రవితేజ కోసం ప్రత్యేక ప్రశ్నావళి

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇప్పటివరకు జరిగింది ఒకెత్తు, ఈరోజు జరగబోయేది మరో ఎత్తు. అవును.. స్వయంగా రవితేజ మరికాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నాడు. వెండితెరపై ఎనర్జీకి పెట్టింది పేరైన రవితేజకు, ఆ వయసులో అంత ఎనర్జీ ఎలా వస్తోందో తెలుసుకోవాలని సిట్ ఆరాటపడుతోంది. ఇవే కాకుండా.. మాస్ రాజా కోసం మరెన్నో ప్రత్యేకమైన ప్రశ్నలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

పోలీసుల అదుపులో ఉన్న కెల్విన్, రవితేజ పేరు కూడా వెల్లడించాడంటూ వార్తలు వస్తున్నాయి. జేసన్ అనే మధ్యవర్తి ద్వారా రవితేజకు చాలాసార్లు మాదకద్రవ్యాలు ఇచ్చినట్టు వెల్లడించాడట కెల్విన్. అయితే ఈ జేసన్ ఎవరు.. అసలిది ఒరిజినల్ పేరేనా లేక మారుపేరా..? ఈ యాంగిల్ లో రవితేజను ప్రశ్నించే అవకాశముంది.

మరోవైపు రవితేజ సోదరులు భరత్, రఘుకు సంబంధించిన ప్రశ్నల్ని కూడా సిద్ధంచేసింది సిట్. వీళ్లిద్దరూ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవాళ్లే. వీళ్లలో భరత్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాతే డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి కూడా సిట్ ఆరా తీయబోతోంది.

పలు పార్టీల్లో రవితేజ-చార్మి కలుసుకున్న సందర్భాల్ని, పూరి జగన్నాధ్-రవితేజ మధ్య ఉన్న 'బలమైన' బాంధవ్యం గురించి కూడా సిట్ ప్రశ్నించనుంది. ఇక రక్త నమూనాలు, కేశాల్ని ఇవ్వడానికి రవితేజ అంగీకరిస్తాడా లేదా అనే విషయంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. 

Show comments