వావ్‌.. మహేష్‌ కూడా ట్వీటాడండోయ్‌.!

తమిళనాడులో జల్లికట్టు కోసం యువత గత మూడు రోజులుగా ఆందోళనల్ని తీవ్రతరం చేసిన విషయం విదితమే. సాక్షాత్తూ సుప్రీంకోర్టు జల్లిట్టుని నిషేధిస్తే, ఆ జల్లికట్టు తమకు కావాలంటూ యువత రోడ్డెక్కారు. అన్ని రాజకీయ పార్టీలూ, దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ జల్లికట్టుకు అనుకూలంగా నినదిస్తున్నారు. 

తాజాగా, జల్లికట్టుకు మద్దతు పలుకుతున్న సినీ స్టార్స్‌ లిస్ట్‌లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా చేరిపోయారు. జల్లికట్టు కోసం యువత చేస్తున్న పోరాటం అద్భుతమని అభివర్ణించారు మహేష్‌. 'జల్లికట్టు - స్పిరిట్‌ ఆఫ్‌ తమిళనాడు' అంటూ ట్విట్టర్‌లో మహేష్‌ వ్యాఖ్యానించడం విశేషమే మరి. జల్లికట్టు తమిళనాడులో సంప్రదాయ క్రీడ. అయినాసరే, ఈ క్రీడ పేరు చెప్పి జంతువుల్ని హింసిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ నేపథ్యంలోనే జల్లికట్టుపై నిషేధం విధించబడింది. 

కారణాలేవైనా, ఎలాంటి విధ్వంసాలకూ తావివ్వకుండా తమిళ యువత తమ వాయిస్‌ని బలంగా విన్పించేందుకు ప్రయత్నిస్తుండడాన్ని అభినందించి తీరాల్సిందే. అయితే, న్యాయస్థానం నిషేధం విధించాక, ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండడం, ఆ ఆందోళనలకు సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతిస్తుండడం కాస్త ఆలోచించాల్సిన విషయమే.

Show comments