మోడీ విజయవంతం అయ్యింది ఇంకెక్కడ?

అచ్ఛే దిన్ అంటూ అధికారాన్ని సాధించుకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విజయవంతం అయ్యింది ఎక్కడ? అంటే... మోడీ భక్తులు, కాషాయ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇచ్చే సమాధానాల్లో అతి ముఖ్యమైనది 'విదేశాంగ విధానం'.   ప్రధానమంత్రి మరీ ఇంతలా విదేశాలు ఎందుకు తిరుగుతున్నాడు? ప్రత్యేక విమానంలో ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఆయన ఏం సాధిస్తున్నాడు? అంటే.. ప్రపంచ దేశాలతో మైత్రిని పెంపొందించి, చక్కటి విదేశాంగ విధానంతో దేశ స్థాయిని పెంచుతున్నాడు. అనే సమాధానమూ వస్తుంది. 

వానొచ్చిదంటే బురద కనపడాలి.. విదేశాంగ విధానంలో విజయం అంటే అందుకు ఫలితంగా ఏదో ఒకటి చెప్పుకోవడానికైనా ఉండాలి. మరి రెండేళ్ల నుంచి తిరిగిన దేశాలనే మళ్లీ మళ్లీ తిరగేస్తూ... ఉన్నాయో లేవో కూడా తెలియని దేశాలను కూడా చుట్టేసిన మోడీగారు సాధించింది ఏమిటి? విదేశాంగ విధానాన్ని కొత్త హైట్స్ కు తీసుకెళతాడని చెబుతున్న ఆయన ఆధ్వర్యంలో సాధించింది ఏమిటి? అంటే... ఎన్ఎస్ జీ సభ్యత్వం అని చెబుదామని మోడీ భక్తులు కాచుకు కూర్చున్నారు.

అయితే.. అది కూడా సాధించలేకపోయింది భారత విదేశాంగ విధానం! ఇంతలోనే ఎంత తేడా? ఎన్ఎస్ జీకి సభ్యత్వానికి సానుకూలత కనిపించినంత సేపూ మీడియా దాని గురించి ఊదర గొట్టింది! ఎన్ఎస్ జీలో స్థానం దక్కితే దేశానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. భారత దేశం ఎంత పవర్ ఫుల్ అవుతుందో మీడియ పతాక శీర్షికల్లో పెట్టి వివరించింది. అయితే.. ఎన్ఎస్ జీలో స్థానం సంపాదించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైన విధానాన్ని మాత్రం ఏ మీడియా వర్గమూ వివరించడం లేదు!

పాపం.. ఎన్ఎస్ జీ లో సభ్యత్వం ఖాయమైందనుకుని.. మోడీ ప్రపంచ పర్యటనలన్నింటికీ ఇదే సార్థకత అంటూ ప్రచారం మొదలుపెట్టి, ఈ విశ్లేషణలతో ఎడిటోరియల్స్ రాసిన వాళ్లు ఇప్పుడు 'ఎన్ఎస్ జీ' అనే మాటే ఎత్తడం లేదు! ఎన్ఎస్ జీ లో స్థానం ఖాయం అనుకుని.. ఇన్ని రోజులూ మోడీ విదేశీ పర్యటన మీద విమర్శలు చేసిన వారి మీద కూడా ఎదురుదాడి చేశారు. మీకేం తెలుసు మోడీ అంటే? అని ప్రశ్నించారు Readmore!

చివరికి ఏమైంది? చైనా మోసం చేసిందట! స్విట్జర్లాండ్ షాకిచ్చిందట! మీడియా చేతిలో ఉంటే ఏమైనా పలికించవచ్చు. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్న వ్యక్తి ప్రధానమంత్రి. అమెరికాలో మోడీకి బ్రహ్మరథమన్నారు, స్టాండింగ్ ఒవేషన్ ఎన్నిసార్లు చేశారో లెక్కలేసి చెప్పారు. అయితే ఆ వీడియో చూస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. అదేంటో... తన ప్రసంగానికి మోడీగారు తనే చప్పట్లు కొట్టుకొంటారు!

ఈ మాత్రం దానికి నెహ్రూ ను కూడా విమర్శించారు. ఆయన విదేశాంగ విధానాన్ని ఈ రోజున విమర్శిస్తున్నారు ఈ మీడియా తయారు చేసిన నేతలు. 60 ఏళ్ల కిందట పరిస్థితులను, నెహ్రూ తీరును విమర్శించే ఈ మొనగాళ్లు తాము దేశానికి సాధించింది పెడుతోంది ఏమిటో ఒక్క సారి విశ్లేషించుకుంటే బాగుంటుంది.

సందేహం ఏమిటంటే.. రెండేళ్లలో మోడీ విజయవంతం అయ్యింది ఇంకెక్కడ? నల్లధనాన్ని వెనక్కు తెప్పించడంలోనా?  నిత్యవసరాల ధరలను నియంత్రించడంలోనా? పెట్రో ధరలను పెంచడంలోనా? పాకిస్తాన్ ను కంట్రోల్ చేయడంలోనా? కాశ్మీర్ లో భారత అనుకూల పరిస్థితులను ప్రతిష్టించడంలోనా? రాజకీయ అవినీతిని అరికట్టడం లోనా? .. ఇవన్నీ కాదు, విదేశాంగ విధానంలో అని చెప్పే వారు కదా! అందులోనూ దారుణ వైఫల్యమే మిగిలింది. అందుకే మీడియా ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వదిలేసి మరో రకంగా మోడీ భజన అందుకుంది. జనాల మైండ్స్ ను ఎలా ట్యూన్ చేయాలో మోడీకి తెలియదా? ఆయనను మోసే మీడియాకు తెలియదా?

Show comments

Related Stories :