'హరి' కథ ఎప్పుడు కట్టిపెడతారు?

ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బోరు కొడితే 'చాలించు నీ హరికథ' అని కొందరు విసుక్కుంటారు. నిజమైన హరికథలు కూడా అందరికీ ఆసక్తిగా ఉండవు కదా...! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులకు కూడా 'హరి' కథ విసుగుపుడుతోందట...! ఇంకా ఎన్నాళ్లు వినాలి ఈ హరి కథ. వెంటనే దాన్ని కట్టిపెట్టండి అని మండిపడుతున్నారట...! హరి కథ ఆపకపోతే రాష్ట్రంలో కాషాయం కషాయం తాగాల్సిందేనని అంటున్నారట...! ఇక్కడ హరి కథ అంటే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కథ అని అర్థం.

 రాష్ట్ర బీజేపీ నాయకులకు హరిబాబు మొహంమొత్తిపోయాడని, వెంటనే ఆయన్ని మార్చాలని నాయకులు రాష్ట్రస్థాయి సమావేశంలోనే, అందులోనూ హరిబాబు సమక్షంలోనే డిమాండ్‌ చేసినట్లు ఓ పత్రిక కథనం. ఇలా డిమాండ్‌ చేసినవారు టీడీపీకి వ్యతిరేక వర్గీయులు కావొచ్చు. టీడీపీని సంతృప్తిపరచడానికే హరిబాబును కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. దేశమంతా కాషాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల, కార్యవర్గాల ఏర్పాటు పూర్తయినా ఆంధ్రాలో ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎప్పుడో కిషన్‌ రెడ్డిని మార్చి డాక్టర్‌ లక్ష్మణ్‌ను నియమించారు. కాని ఆంధ్రా పెండింగులో పడిపోయింది. 

కొంతకాలం కిందట ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. ఆ సమావేశాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశం జరిగినప్పుడు ఆంధ్రా బీజేపీ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎంపిక చేశారని, ఇక అధికారికంగా న్రకటించడమే తరువాయని మీడియాలో వార్తలొచ్చాయి. కాని ఆ తరువాత ఇప్పటివరకు డెవెలప్‌మెంట్‌ లేదు. కొత్త అధ్యక్షుడిని ప్రకటించకపోవడానికి చంద్రబాబు, వెంకయ్య లాబీయింగ్‌ కారణమని ఒక వర్గం నాయకులు అనుమానిస్తున్నారు. హరిబాబును వెంకయ్య వర్గీయుడిగా చెబుతారు. 

అందులోనూ అతను చంద్రబాబు పట్ల సాఫ్ట్‌గా ఉంటాడని,  మనిషి కూడా మెత్తటివాడని అంటారు. బాబు సామాజికవర్గానికే చెందినవాడు. అతని స్థానంలో సోము వీర్రాజును నియమిస్తే బాబుకు చికాకు కలిగిస్తాడని, తద్వారా ఎన్నికలకు ముందే స్నేహ బంధం పెటాకులవుతుందని పార్టీలోని బాబు వర్గీయులు అనుకుంటున్నారు. నిజానికి బీజేపీకి ఇప్పుడు కావల్సింది టీడీపీ మీద దూకుడుగా వ్యవహరించేవాడు ప్లస్‌ కాపు సామాజిక వర్గాన్ని పార్టీ వైపు తిప్పగలిగినవాడు. ఈ రెండు పనులు సోము వీర్రాజు చేయగలడనే నమ్మకం నాయకత్వానికి ఉంది. 

ఈయన మొదట్నుంచీ చంద్రబాబు మీద, టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పలుమార్లు చెప్పాడు. వీర్రాజు వర్గానికి, టీడీపీ నాయకులకు మధ్య అనేకసార్లు మాటల యుద్ధం జరిగింది. టీడీపీతో కలిసి వుండాలని బీజేపీ నాయకత్వం అనుకోవడంలేదు కాబట్టి  యుద్ధానికి వీర్రాజు బాగా పనికిస్తాడని నాయకత్వం భావించిందేమో. అలాగని టీడీపీతో బంధం తెంపుకుంటే నష్టపోతామనే భయం కూడా బీజేపీ నాయకత్వానికి ఉంది. చివరకు ఎటూ పాలుపోక హరిబాబును కొనసాగిస్తున్నారు. 

హరిబాబును తొలగించాలని పార్టీ నిర్ణయించుకోగానే ముందుగా వినిపించిన పేరు సోము వీర్రాజు. పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నట్లయితే ఈయన్ని ఎప్పుడో అధ్యక్షుడిగా నియమించాల్సింది. కాని పార్టీలో వర్గ రాజకీయాలున్నాయి. ముఠా కుమ్ములాటలున్నాయి. పార్టీలో కంభంపాటి వర్గం, వీర్రాజు వర్గం ఉండటమే కాకుండా చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి. మధ్యలో ఒకసారి వీర్రాజు వద్దనుకున్నారు. అప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరు తెర మీదికి వచ్చింది. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. 

పార్టీని నడిపించగల, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరాడగల సామర్థ్యం ఈయనకు ఉందని నాయకత్వం భావించిందట.  అమిత్‌ షా రాజమండ్రికి వచ్చినప్పుడు భారీ బహిరంగ సభ నిర్వహించారు.  ఆ సభను విజయవంతంగా నిర్వహించిన నాయకుడు ఆకుల సత్యనారాయణ. రాజమండ్రిలో గత ఎన్నడూలేని విధంగా అమిత్‌ సభకు దాదాపు 85 వేల మంది హాజరయ్యారని పార్టీ వర్గాలు చెబతున్నాయి. ఈ క్రెడిటంతా సత్యనారాణ ఖాతాలోకి వెళ్లింది. కాబట్టి రాష్ట్ర పగ్గాలు ఆయనకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు.  కాని ఆయన్ని పక్కకు పెట్టేశారు. మరి హరిబాబను ఎన్నాళ్లు కొనసాగిస్తారో చూడాలి. 

Show comments