సూపర్ స్టార్ రజనీకాంత్ ఈజ్ బ్యాక్.. 'రోబో 2.0' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రజనీకాంత్. సినిమా నిర్మాణ సమయంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది 'రోబో 2.0'. సంచలన విజయాన్ని సాధించిన 'రోబో'కి సీక్వెల్ ఇది. రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
ఇదిలా వుంటే, ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఒకదాన్ని మించి ఇంకోటి బయ్యర్లకు నష్టాల్నే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ 'రోబో 2.0' సినిమాపై ఏ స్థాయిలో ప్రభావం పడ్తుందోనని రజనీకాంత్ అభిమానులు ఆందోళన చెందుగారుగానీ, రజనీకాంత్ ఏ సినిమా చేసినా, అంతకు ముందు సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా అంచనాలు పెరిగిపోతుంటాయి. 'రోబో 2.0' విషయంలోనూ అంతే.
రజనీకాంత్‌కి జపాన్, చైనా తదితర దేశాల్లో వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని, 'రోబో 2.0'ని ప్రపంచంలోని పలు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ సినిమా వుంటుందని దర్శకుడు శంకర్ భరోసా ఇస్తున్న విషయం విదితమే. బయ్యర్ల నుంచీ 'రోబో 2.0'పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందట. రికార్డు స్థాయిలో 'రోబో 2.0' హక్కుల అమ్మకాలు వుంటాయని తమిళ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటిదాకా అంచనాల పరంగా 'కబాలి'దే రికార్డ్. ఆ సినిమా కోసం విమానాలపై కూడా 'కబాలి' ప్రమోషన్ జరిగింది. మరి, 'రోబో 2.0'కి ఇంకేం చేస్తారో.. వేచి చూడాల్సిందే.!