విజయద్వయం: ఇద్దరూ ఇద్దరే..!

ఇళయరాజా తల పొగరు తగ్గించుకుంటే మంచిదని భారతీరాజా ఆ మధ్య సూచించాడు... పనిమంతుడు తన పనేదో చూసుకుంటాడే తప్ప.. పనికిమాలిన మాటలతో పొద్దు పుచ్చడు.. అని ఇళయరాజా కౌంటరిచ్చాడు! వాళ్లిద్దరూ దెప్పి పొడుచుకునే అంశాలను పరిశీలించడం మొదలుపెట్టాలే కానీ, ఇలా ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు, సంధించుకున్న వ్యంగ్యాస్త్రాలు బోలెడన్ని దొరుకుతాయి! నిజం చెప్పాలంటే.. వాళ్లు కావాలని ఇలా ఒకరినొకరు కించపరుచుకోరు. అంత సమయం కూడా ఉండకపోవచ్చు. కానీ మీడియా ఊరికే ఉండదు కదా... ఒకరి దగ్గర మరొకరి మాటలను కూస్తుంది. స్పందించమంటుంది.. మీడియా వందసార్లు ప్రస్తావిస్తే, వీళ్ల నారద పాత్రకు రెచ్చిపోయిన వాళ్లిద్దరూ ఏదో ఒకసారి ఒకరినొకరు ఏదో ఒకటి అనుకుంటారు! ఎన్ని తిట్టుకున్నా, ఏ రకమైన మాటలతో దెప్పి పొడుచుకున్నా... వాళ్లు ఇద్దరూ ఇద్దరే!

పరస్పరం తిట్టుకునే సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై మరొకరు అక్కసు వెళ్లగక్కుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ.. భారతీ రాజా, ఇళయరాజాల పరస్పర నిందలు మాత్రం ప్రత్యేకం. వీళ్లది అక్కసు కాదు... అనుబంధమే, అలా బయటపడుతూ ఉంటుంది అది. వీళ్లిద్దరూ తిట్టుకున్నా.. వినే వాళ్లకు అదో సరదా. కలిసి పని చేయడం ఆగిపోయి చాలా కాలం అయ్యింది.. అలాంటప్పుడు వీళ్లు ఇలా నిందించుకోవాల్సిన అవసరం ఏముంది? కలిసి సష్టించిన సజనలో క్రెడిట్ కోసమూ పోటీలేమీ లేవు. అయినా.. ఈ కలహమూ వారి మధ్య అనుబంధమే అనాలి.

సినీ పరిశ్రమలో ఒకరి నీడన ఎదిగొచ్చి.. ఒకరి సాయంతో నిలదొక్కుకుని, పై కెదిగి.. తర్వాత వాళ్ల మేలు మరిచిన వాళ్లు, వాళ్లేక వెన్నుపోటు పొడిచిన వాళ్లు, తమకు సాయం చేసిన వాళ్లు కష్టాల్లో ఉండినా తిరిగి సాయం చేసే మనస్తత్వం లేని వాళ్లు.. ఎంతో మంది కనిపిస్తారు. ఈ విషయాల్లో ఎన్నో వివాదాలు మీడియాకే ఎక్కుతుంటాయి కూడా. కానీ ఇప్పటికీ చెబుతారు.. ఇళయరాజా సోదరులు. తాము  భారతిరాజా నీడన ఎదిగొచ్చిన వాళ్లమని!

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తేనీ జిల్లాలోని ఒక గ్రామీణ ప్రాంతానికిచెందిన వ్యక్తి భారతీరాజా. దక్షిణాది చిత్రపరిశ్రమ బ్లాక్ అండ్ కాలంలో ఉన్న రోజుల్లో మద్రాస్ వచ్చి తెలుగు, తమిళ దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ తన అవకాశాల వేటలో ఉన్న భారతిరాజాను నమ్ముకుని చెన్నపట్టణంలో అడుగపెట్టారు ఇళయరాజా సోదరులు. పక్కా గ్రామీణుల్లాంటి వీళ్లు అప్పటికి భారతిరాజా కన్నా అన్నింటిలోనూ తక్కువైన వాళ్లే! వీటిలో ప్రధానమైన తేడా తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో వివక్షాపూరిత విషం అయిన ‘‘కులం’’ విషయంలో. దానికి భారతిరాజా ప్రాధాన్యతను ఇవ్వలేదు.

కచేరీలు చేసుకునే వాళ్లు.. ఒకరు పాట రాస్తారు, మిగిలిన ఇద్దరూ పాటలకు ట్యూన్ కట్టగలరు. పాడగలరు.

ఈ విద్యలు తెలిసిన వీళ్లు చెన్నైలో కచేరీలు చేసుకొంటూ, వీలైతే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉండగా.. వీరికి ఆశ్రయం కల్పించింది భారతిరాజా. ఈ ట్రూపుకు ఇళయారాజా అన్న నాయకుడు. తమకు ఆశ్రయం ఇచ్చిన భారతిరాజా కన్నా ముందే ఇళయరాజా సంగీతదర్శకుడయ్యాడు. ఒకవైపు ప్రదర్శనలు ఇచ్చుకుంటూనే సంగీతానికి సంబంధించిన కోర్సులు కూడా చేసిన ఈ సహజ సంగీత జ్ఞాని దేవరాజ్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ‘‘అన్నాక్కిలి’తో(తెలుగులో ‘భద్రకాళీ’) సంగీత దర్శకత్వానికి అవకాశం దక్కింది. అలా మొదలైంది ఆ ప్రభజనం.

ఒక్క ఏడాది లేటుగా దర్శకత్వం అవకాశాన్ని సంపాదించాడు భారతీరాజా. 1977లో వచ్చిన ‘‘పదహారు వయతినిలే’’ భారతిరాజా తొలి చిత్రం. ఆప్తమిత్రుడి తొలి సినిమాకు ఇళయరాజా సమకూర్చి పెట్టిన సంగీతం గురించి విరించి చెప్పడం సాధ్యం అయ్యే పనేనా? ఆ సినిమా సంచలన విజయం సాధించడంలో ఇళయరాజా సంగీతానిది ముఖ్యపాత్ర. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. రాష్ర్ట అవార్డులు, జాతీయ అవార్డు బోనస్.

‘‘కిళేక పోగుం రైల్’, ‘‘ఎర్రగులాబీలు’’ ‘టిక్ టిక్ టిక్’’ ‘‘మన్ వాసనై’’... ఇలా ఊపందుకున్న ఈ ప్రయాణం దాదాపు దశాబ్దంన్నర కాలం ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే నడిచింది. ఇళయరాజాది, భారతీరాజాది హిట్ కాంబినేషన్ అనో.. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయనో.. చెప్పి వదిలేయలేం. వీళ్లిద్దరూ ఒకరికోసం మరొకరు మత్రమే పని చేయలేదు!

తమిళ, తెలుగు భాషల్లో బోలెడంత మంది దర్శకులతో కలిసి పని చేశాడు ఇళయరాజా.. ఏ దర్శకుడితో ఆయనది హిట్ కాంబినేషన్ కాదు? ఇక భారతిరాజా కూడా తన కెరీర్‌లో బోలెడంత మంది సంగీత దర్శకులతో పని చేశాడు కదా.. దేవా, ఏఆర్ రెహమాన్‌ల దగ్గర నుంచి హిమేష్ రెషిమియా వరకూ ఎంతోమందితో పని చేశాడు.. ఎన్నో హిట్ సినిమాలు తీశాడు భారతీరాజా. సినిమాకు మించిన అనుబంధం... అంతకు మించిన స్నేహం.. వీళ్లది. 

వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు హిట్టయ్యాయి.. ఆ పాటలు అజరామరం అయ్యాయి.. చెప్పుకునేవి కేవలం కొసరు మెరుపు మాటలు మాత్రమే! వీళ్లిద్దరి అనుబంధం వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల కన్నా చాలా గొప్పది.

ఒకదశ వరకూ ‘‘స్నేహితుల దినోత్సవం’’ వచ్చిదంటే మీడియా సెలబ్రిటీ మధ్య స్నేహాల గురించి రాసుకునే ప్రత్యేక కథనాల్లో వీరిద్దరి ప్రస్తావన తప్పక ఉండేది. వీళ్ల అపురూప స్నేహం గురించి మీడియా వివరించేది. విబేధాలు రావడం, ఒకరితో మరొకరు పని చేయడం మానేయడం.. ఇవన్నీ జరిగాకా కూడా వీళ్లు స్నేహానికి ఐకాన్స్‌గానే మిగిలిపోయారు. అదే ఈ ద్వయం గొప్పదనం.

బహుశా పదేళ్ల కిందట.. ఒకసారి ఇళయరాజా వివరించారు.. తాము ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటామని, ఎక్కడైనా కనిపిస్తే పలకరించుకుంటాంఅని. ఇళయరాజా చెప్పిన మరో విషయం ఏమిటంటే.. తామిద్దరం ఇప్పుడు ఒకప్పటి మనుషులం కాదనేది. ఒకప్పటి భారతీరాజా, ఇళయరాజాలు ఎదురుపడితే పలకరింపులు యాంత్రికం కాదు, కనపడగానే అడిగే ప్రశ్న ‘‘ఏమయ్యా.. తిన్నావా..’’ అని, తినలేదంటే ‘‘రా భోంచేద్దాం..’’ అంటూ చొరవ తీసుకునే భారతిరాజా ఇప్పుడు లేడు అని. అలాగని తనకు తాను ఉత్తముడని సర్టిఫై చేసుకులేదు ఈ సంగీత జ్ఞాని. పాత ఇళయరాజానూ లేడు, పాత భారతీరాజానూ లేడు అని అన్నారాయన. వచ్చిపడిన పేరు ప్రఖ్యాతుల కన్నా.. కోల్పోయిన ఒకనాటి స్నేహం చాలా ఉన్నతమైనదని ఇళయరాజా అన్నారు. ఇళయరాజా, భారతిరాజాలు సినిమాలతో సాధించుకున్న చిరకాల పేరు ప్రఖ్యాతుల కన్నా గొప్పది ‘స్నేహం’. ఇది కూడా వారి భావనే! 

ఇంతలోనే.. మళ్లీ మీడియా మొదలుపెట్టింది.. ఇళయరాజాను భారతీయ రాజా ‘‘కర్రోడు..’’ అని అన్నాడని, భారతీరాజా స్వార్థపరుడు అని ఇళయరాజా అన్నాడని..!

- జీవన్ రెడ్డి.బి 

Show comments