పోలవరం సవాల్ స్వీకరించగలరా?

పోలవరం పై జరుగుతున్న బాబు అనుకూల ప్రచారం ఇంతా అంతాకాదు. పట్టి సీమ ప్రచారానికి పదింతలు చేస్తున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు అన్నది బాబు బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా, ఆయనే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తున్నట్లుగా హడావుడి జరిగిపోతోంది. ఈ ప్రచారం కారణంగా దీని వెనుక రెండు నిజాలు సమాధి అయిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా అలా వుండిపోయిన పోలవరం ప్రాజెక్టును ముందుకు కదిలేలా చేసింది వైఎస్ అన్నది విషయాన్ని చాలా చాకచక్యంగా దాచేస్తున్నారు. 

అలాగే వైఎస్ ముందు చూపుతో కుడి ఎడమ కాల్వులు చకచకా రెడీ చేయిస్తుంటే, తాము అడ్డగోలుగా విమర్శలు చేసిన సంగతి, దానికి వ్యతిరేకంగా వార్తలు వండి వార్పించిన సంగతి జనానికి గుర్తురాకుండా చేస్తున్నారు. వైఎస్ కట్టిన పోలవరం కాల్వల ఆధారంగానే పట్టిసీమ ప్రాజెక్టు చకచకా పూర్తి చేయగలిగామని మాటమాత్రమైనా చెప్పకుండా మేనేజ్ చేస్తున్నారు. 

వీటన్నింటికి మించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయంలో జరుగుతున్న లావాదేవీలపై వస్తున్న వార్తలపై స్పందించడం, సమాధానం ఇవ్వడం, పారదర్శకత పాటించడం మానేసారు. ఈ ఆర్థిక అవకతవకలపై మాట్లాడుతుంటే, వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకి అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు. పది రూపాయిలు అంచనా వ్యయం పెంచినా, పది రూపాయిలు అడ్వాన్స్ చెల్లింపులు జరిపినా నానా గగ్గోలు చేయడం అలవాటైన మీడియా ఇప్పుడు కోట్లకు కోట్లు దాటి పోతున్నా మౌనం వహిస్తోంది.

ఇలాంటి వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు కేవిపి బహిరంగ చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లేస్ ఎక్కడయినా ఓకె అంటున్నారు. కానీ, ఇప్పుడు పోలవరం పై బహిరంగ చర్చ అంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకే ఏదో అడ్డగోలు వాదన చేయడం తప్ప తెలుగుదేశం నాయకులు కానీ, ప్రభుత్వం కానీ పోలవరంపై బహిరంగ చర్చకు సిద్దం కావు. లేదా శ్వేతపత్రం ప్రకటించవు. శ్వేత పత్రమే ప్రకటిస్తే,  పోలవరం కుడిఎడమ కాల్వల నిర్మాణం ఎవరి హయాంలో ఎంతవరకు జరిగింది. అనుమతులు ఎవరి హయాంలో ఏ మేరకు వచ్చాయి.

నిర్మాణ వ్యయం ఎవరి హయాంలో ఏ మేరకు పెరిగింది వంటివి అన్నీ పొందుపర్చాలి కూడా.  అందుకే అలాంటి చర్చలు, శ్వేత పత్రాలు లాంటి వ్యవహారాల జొలికి బాబు గారు అండ్ కో వెళ్లమన్నా వెళ్లరు. ఏదో బుకాయింపులు, ఎదురుదాడులు మాత్రం మామూలుగా సాగుతాయి. ఈ సంగతి డిమాండ్ చేసిన కెవిపికి మాత్రం తెలియంది కాదు. కానీ కాస్తయినా కాంగ్రెస్ పై దాడి ఆపుతారనే ఆయన ఈ అఫెన్స్ లోకి వెళ్లి వుంటారంతే.

Show comments