వామ్మో..భజన మీడియా.. బాబు పరువు తీయడానికా!

వామ్మో.. వాయ్యో… తెలుగు జనాలు మరీ ఎంత లోకువ అయిపోతే మాత్రం, రాసుకోవడానికి చేతిలో పెన్నుంటే మాత్రం.. ప్రింట్ చేసుకోవడానికి ఫండ్స్ వచ్చి పడుతుంటే మాత్రం… ఇంత బరి తెగింపా! తెలుగు పత్రికా రాజాలను చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడంలా. వీళ్ల కూతలకూ, రాతలకూ ఒక హద్దంటూ లేకుండా పోతోంది! బాబు భజన పరాకాష్టకు చేరింది… ఆఖరికి అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో కూడా ఈ ఆకు జర్నలిస్టులు తమకు తోచింది రాసుకుపోతున్నారు.

వారం వర్జ్యం అంటూ తేడా ఏమీ లేదు.. ఒకడేమో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ రాస్తాడు! విశాఖలో రెండో భాగస్వామ్య సదస్సట.. ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమట! ఏపీ జనాలు ఎంత వెర్రి వెంగలాయులు కాకపోతే… గత ఏడాది వచ్చాయన్న నాలుగు లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులకే దిక్కూదివాణం లేదు. అప్పట్లో అదిరిపోయిన ఆ భాగస్వామ్య సదస్సులో వచ్చాయన్న పెట్టుబడుల గురించి ఇటీవల కాంగ్రెస్ వాళ్లు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే.. అనాపైసా రాలేదన్న విషయం పై స్పష్టత వచ్చింది. 

మరి గత ఏడాది నాలుగున్నర లక్షల కోట్లు అంటూ  నాలుగు కోట్ల మంది ప్రజల చెవిలో క్యాబేజీ పెట్టిన పని పూర్తి అయ్యింది. ఈ సారి ఏడు లక్షల కోట్లు అట! కామెడీకి కూడా ఒక హద్దూ పద్దంటూ లేకుండాపోతోంది. కామెడీ కోసం సినిమాలు చూడనక్కర లేకుండా.. తెలుగు పత్రికా రాజాలను చదువుకుంటే.. బోలెడంత వినోదం!

ఏమైనా డౌటా.. ఈ రోజు ఇంకో భజంత్రీ పత్రిక రాసిన రాతలు చదివితే సకల వికారాలూ కలుగుతాయి. హెడ్డింగ్ చదివితే నవ్వొస్తుంది.. లోపలకు వెళ్లి చదివితే వాంతొస్తుంది!

ఇంతకీ ఏం చెప్పొచ్చారంటే.. హిల్లరీ క్లింటన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే చంద్రబాబు కుటుంబానికి ఆహ్వానం అందిందట! అదేంటి.. అప్పుడే ప్రమాణ స్వీకారోత్సవం ఏమిటి? ఇంకా ఎన్నికలే జరగలేదు కదా! అంటారా.. అంతే వాళ్లిష్టం. వాళ్ల పేపరు.. వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారు!

బాబు ఇది వరకూ సీఎంగా ఉన్నప్పుడు.. క్లింటన్ ఇండియా పర్యటనకు, హైదరాబాద్ కు వచ్చాడు కదా! అప్పటి నుంచి నారా ఫ్యామిలీకి, క్లింటన్ ఫ్యామిలీకి బంధం జిగురులా అతుక్కుపోయిందట. ఇప్పటికే హిల్లరీని గెలిపించడానికి తగిన ఏర్పాట్లన్నింటినీ బాబు చేసేశాడట. అక్కడి హిల్లరీ ప్రచారానికి తగిన నిధుల పోగేయడంలో బాబు చక్రం తిప్పాడు.. సీమాంధ్రుల ఓట్లన్నీ సాలిడ్ గా హిల్లరీకే పడేటట్టు.. మంత్రాంగం చేసేడట. 

ఇంతేనా.. ఈ ప్రహసనం చెబితే చాలానే ఉంది. అప్పట్లో భర్త క్లింటన్ వెంట వచ్చిన హిల్లరీ క్లింటన్ బాబుకు సాన్నిహిత్యం  ఉన్నట్టుగా.. క్లింటన్ ల బిడ్డ చెల్సియాతో చిన్నబాబు లోకేష్ కు సాన్నిహిత్యం ఉందట. క్లింటన్ దంపతులతో పాటు అప్పట్లో చెల్సియా కూడా ఇండియా వచ్చింది కదా.. అలా వచ్చిన ఆమెకు చినబాబు హైదరాబాద్ అంతా తిప్పి చూపాడట! అలా ఆళ్లిద్దరూ ఫ్రెండ్సయ్యారట!

ఇంత చదివాకా కూడా బతికున్న మనుషుల కోసం.. ఇంకా ఎంతో కామెడీని రాసి పెట్టింది.. ఆ పత్రిక. నారా ఫ్యామిలీ క్లింటన్ ఫ్యామిలీ బయటకు బంధాన్ని ప్రదర్శించడం లేదు కానీ.. వామ్మో వాళ్లిద్దరి మధ్య అనుబంధ బంధవ్యాలు మామూలు మనుషులకు అర్థం కావట!

ఇంత రాశారు కదా.. దీంట్లో లాజిక్కు అడగొద్దు, అమెరికా అధ్యక్ష పీఠానికి హోరాహోరీగా పోరు జరుగుతోంది కదా.. అప్పుడే ఆహ్వానాలేమిటీ అనొద్దు, చిన్నబాబుకూ చెల్సియాకు మధ్య నడిచిన ప్లేటోనిక్ లవ్ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఒకే ఒక ప్రశ్న! ఇంతకీ ఈ రాతలన్నీ బాబు  ప్రతిష్టను పెంచడానికి రాశారా? లేక ఆయన పరువును తీయడానికి కంకణం కట్టుకుని రాశారా? దీనికే సమాధానం దొరక్క చాలా మంది నెటిజన్లు జుట్టు పీక్కొంటున్నారు! వీళ్లలో ముందున్నది తెలుగు తమ్ముళ్లే!

Show comments