ఆ మీడియాకు 'పదివేల' దండాలు

వైఎస్ జగన్ ను బద్ నామ్ చేయడానికి అంగుళం అవకాశం ఎక్కడ దొరుకుతుందా? వాడేద్దాం అని, సదా దుర్భిణీ వేసి చూసే ఓ సెక్షన్ ఆప్ మీడియా మన తెలుగులో వుంది. తమ తమ సామాజిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ఓ వ్యక్తి వ్యక్తిత్వ హననం అన్నది ఆ మీడియాకు నిత్య కృత్యమైపోయింది. 

కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద ఆదాయ పథకం కింద హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పదివేల కోట్లు వెల్లడించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆదాయపన్ను స్కీము రూల్స్ ఫ్రకారం ఆ వ్యక్తి పేరు వెల్లడించకూడదు. ఇక అదే అవకాశం. మన మీడియా, అలాగే జగన్ వ్యతిరేకులు రెచ్చిపోయారు.

ఆ పదివేల కోట్లు వెల్లడించింది జగన్ నే అనే అన్యాపదేశ అర్ధం వచ్చేలా కథనాలు వండి వార్చారు. అలాగే తెలుగుదేశం నాయకులు అయితే నేరుగానే ఆరోపణలు చేసారు. ఓ మీడియా అయితే, ఏకంగా నమ్మబలికే విధంగా కథనాలు వండింది. ఆడిటర్ 200 కోట్లు, బిజినెస్ మెన్ 9800 కోట్లు ప్రకటించారని, దీనిపై పెద్ద పెద్ద వాళ్ల మధ్య ఫోన్ లు ఎలా నడిచాయో, వెల్లడిస్తూ వ్యాసాలు రాసేసారు.

దీంతో ఇలాంటి మీడియా కథనాలు నమ్మే అమాయక జనాలు జగన్ నే ఆ పదివేల కోట్లు వెల్లడించిన వ్యక్తి అని అనుకోవడం ప్రారంభించారు. అంతే కానీ, ఇదే మీడియా ఇన్ని వందల కోట్లు, అన్ని వేల కోట్లు జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసిందని రాసిన వార్తలు మరిచిపోయారు. ఇంకా పదివేల కోట్లు ఎలా ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయని అనుకోనేలేదు.

కట్ చేస్తే..

నోట్ల రద్దు వచ్చింది. తెలుగుదేశం జనాలు మళ్లీ గొంతులు సవరించుకున్నారు. జగన్ తన దగ్గర వుండిపోయిన నల్లడబ్బు పై కిందా మీదా పడుతున్నారని, బంగళూరు నేలమాలిగలోని పెద్ద నోట్లు ఏం చేయాలా అని తెగ సతమతమవుతున్నారని ఆరోపణలు చేసారు. మరి పది వేల కోట్ల నల్లధనం వెల్లడించింది నిజం అయితే, మళ్లీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అది నిజమైతే, ఇది అబద్ధం..ఇది నిజమైతే, అది అబద్ధం అన్న సంగతే జనాలకు తట్టకుండా మళ్లీ ఈ మీడియానే ఆ ఆరోపణలను పదే పదే ప్రచురించింది

మళ్లీ కట్ చేస్తే..

హైదరాబాద్ లో పది వేల కోట్లు నల్లధనం వెల్లడించిన వ్యక్తి బాణాపురం లక్ష్మణరావు అనే వ్యక్తి అని బయటకు వచ్చింది. అసలు అతనికి అంత సీన్ కూడా లేదని తేలుతోంది. అతని ఇళ్లు, ఆఫీసులు, వ్యాపారాలు బయటకు వచ్చాయి. 

మరి ఇప్పుడు ఇన్నాళ్లు తాము జగన్ ఆ వ్యక్తి అంటూ అన్యాపదేశంగా రాసిన వార్తలు సరిదిద్దుకుంటూ వార్తలు రాస్తుందని ఆశించడం అత్యాశే. ఇక తెలుగుదేశం జనాలు ఇన్నాళ్లు తాము చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకునే చాన్స్ అంతకన్నా లేదు.  కనీసం జనం అన్నా, వీళ్ల బాగోతాలు తెలుసుకుంటే చాలు.

Show comments