ఔరా? ఎంతటి బుకాయింపు

తప్పు చేసిన తరువాత, దొరికిన తరువాత కూడా బుకాయిస్తే, ఆ వ్యవహారం భలేగా వుంటుంది. ఈనెల 10 ప్రధాని మోడీని ఆంధ్ర ప్రతిపక్షనేత జగన్ కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కానీ పైకి ప్రజా సమస్యలని బిల్డప్ ఇచ్చారనీ, అసలు విషయం అంతా తన సమస్యల పైనే ప్రధానిని కలిసారనీ మీడియాలో కథనాలు వెలువడ్డాయి, ఓ మీడియా ఏకంగా 10న జగన్ ప్రధానికి ఇచ్చిన లేఖ ఇదే అంటూ, చివరి పేజీని మాత్రం అందించింది.

దాంతో వైకాపా రివర్స్ అయింది. ఆ లేఖ ఇప్పటిది కాదని, ఫిబ్రవరిలో ఇచ్చినదని స్పష్టం చేసింది. జర్నలిజం దిగజారుడుకు ఈ అబద్దాలే నిదర్శనం అంటూ ఎలుగెత్తింది. అయితే సదరు మీడియా సంస్థ తప్పు ఒప్పుకోకపోగా, బుకాయింపు కు దిగింది. ఎలా వుందంటే అది..

''...లేఖపై తేదీ ఏమిటన్నది కాదన్నయ్యా? ఈ నెల 10న జగన్ స్వంత సమస్యలు ప్రధానికి చెప్పుకున్నారా లేదా?...'' ఇదీ ఆ పత్రిక చెబుతున్నది. అంటే ఇక్కడే అర్థం అయిపోతోంది. తాము ప్రచురించిన లేఖ, వైకాపా చెబుతున్నట్లు పాతదే అని. అయినా కూడా పాత లేఖను, కొత్తలేఖ మాదిరిగా అక్షర విన్యాసం చేస్తూ ప్రచురించాం అని అంగీకరించి, తప్పు ఒప్పుకోవడం లేదు. లేఖ డేట్ ఎవరికి కావాలి. ప్రధానికి జగన్ స్వంత సమస్యలు చెప్పాడని మేం వెల్లడించాం, అది నిజమా కాదా? అంటోంది. కానీ జగన్ కూడా అదే విధంగా అంటే, స్వంత సమస్యలు చెప్పలేదనడం లేదు. కానీ ఇప్పుడు కాదు ఫిబ్రవరి 10న అని అంటే. 

మీడియా అత్యుత్సాహంతో ఒక లేఖను మరో లేఖగా భ్రమింపచేసే ప్రయత్నం చేయడం తప్పు కాదన్నమాట. అవకాశం లభించినపుడు, ప్రజా సమస్యలతో పాటు ప్రధానికి తన సమస్యలు చెప్పుకోవడమే తప్పన్నమాట. ఇదీ మన మీడియా స్వామ్యం.

Show comments