కేజ్రీవాల్‌.. చీకటి యుద్ధం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వింత పోరాటం చేస్తున్నారు.. చీకట్లో యుద్ధం చేస్తున్నారాయన. ఏదో సాధించెయ్యాలన్న ఆరాటం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోంది. ఆయన పోరాట పటిమను మాత్రం ఎవరైనాసరే ప్రశంసించి తీరాల్సిందే. ఓ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. పైగా కేంద్ర పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కేంద్రంతో పోరాటం చేయడమంటే చిన్న విషయమేమీ కాదు. 

అసలు కేజ్రీవాల్‌, ఢిల్లీకి ముఖ్యమంత్రి అవడమే వింత. కాంగ్రెస్‌, బీజేపీ వంటి తలపండిపోయిన రాజకీయ పార్టీలకు 'ఒకే ఒక్కడు' ఝలక్‌ ఇచ్చాడు. అలాంటిలాంటి ఝలక్‌ కాదు. అతని వెనుక సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, రాజకీయ నేపథ్యం అసలే లేదు. అనూహ్యంగా రాజకీయాలల్లోకి వచ్చాడు, వస్తూనే ముఖ్యమంత్రి అయిపోయాడు.. దటీజ్‌ కేజ్రీవాల్‌. అప్పటినుంచీ, కేజ్రీవాల్‌ ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. అందుకే, కేజ్రీవాల్‌ నాయకుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. 

ఇక, కేజ్రీవాల్‌ తాజా పోరాటం, ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చాలనే. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడ్తానని కేజ్రీవాల్‌ గతంలోనే ప్రకటించారు. ఇంకోపక్క లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడెలాగూ కేజ్రీవాల్‌ వాదనకు మద్దతు లభించదనుకోండి.. అది వేరే విషయం. ఆ సంగతి కేజ్రీవాల్‌కీ తెలుసు. అయినాసరే, ఏ అవకాశాన్నీ కేజ్రీవాల్‌ వదులుకోవడంలేదు. 

హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు.. అంటూ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలపై పోరాటం చేస్తాననే చెబుతున్నారు. కేంద్రపాలిత రాష్ట్రాల్లో లెఫ్టినెంట్‌ గవర్నరే సుప్రీం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. విద్యాధికుడైన కేజ్రీవాల్‌కి ఆ విషయం తెలియనిదేమీ కాదు. కానీ, కేంద్రపాలిత రాష్ట్రం కారణంగా ఢిల్లీ అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. అది ఢిల్లీ ప్రజలకి బాగా తెలుసు. ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా చూడాలని అక్కడ మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నమాట వాస్తవమే.  Readmore!

కానీ, ఢిల్లీ దేశ రాజధాని. వ్యూహాత్మకంగా అతి సున్నితమైన ప్రాంతం. దేశ భద్రతకు ఢిల్లీ అత్యంత కీలకం. అందుకే, ఢిల్లీని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రం ఒప్పుకోదుగాక ఒప్పుకోదు. కానీ, కేంద్రంతో పోరాటం కొనసాగించడం ద్వారా, రాజకీయంగా ఎదగాలన్న కేజ్రీవాల్‌ లక్ష్యం మాత్రం నెరవేరుతోంది. చీకట్లోనే యుద్ధం చేస్తున్నా, పొలిటికల్‌ గెయిన్‌ ఎలా సంపాదించాలో బాగా తెలుసాయనకి. దటీజ్‌ కేజ్రీవాల్‌.

Show comments

Related Stories :