ఈ దర్శకుడిని నమ్మే హీరోలున్నారా?!

గౌతమ్ మీనన్ తో నాని సినిమా.. అనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అధికారిక ధ్రువీకరణ కాదు కానీ.. తెలుగులో ప్రామిసింగ్ హీరోగా కొనసాగుతున్న నాని కోసం గౌతమ్ ఒక కథను సిద్ధం చేశాడని, వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్క నుందనే వార్తలు వస్తున్నాయి! 

ఇది వరకూ నాని-గౌతమ్ కాంబోలో ఒక సినిమా వచ్చింది. బహుశా జనాలకు ఆ సినిమా పెద్దగా గుర్తుండకపోవచ్చు కూడా! అంత డిజాస్టర్ ఆ సినిమా. ఆ సినిమాను తన సహజ శైలిలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించాడు గౌతమ్. ఒక్కో భాషల్లో ఒక్కో హీరోతో చేయడం.. ఆయా భాషలకు అనుగుణంగా రీ షూట్లతో గౌతమ్ సినిమాల బడ్జెట్లు తడిసి మోపెడవుతాయి. 

నాని, జీవాలతో అలా రూపొందించిన బైలింగ్వల్ కాన్సెప్ట్ ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాతన తన శిష్యుడొకడిని దర్శకుడి స్థానంలో కూర్చోబెట్టి నితిన్ తో చేసిన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’’ ను కూడా తమిళంలో మరో హీరోతో రూపొందించాడు గౌతమ్. ఆ సినిమా డెలివరీలో చాలా వాయిదాలు పడటంతో మురిగిపోయింది.

ఇక ‘సాహసం శ్వాసగా సాగిపో..’ కథ సరేసరి! ఈ సినిమాను కూడా తన రొటీన్ స్టైల్లో రెండు భాషల్లో ఇద్దరు హీరోలతో చేయడంతో విడుదల జాప్యం జరిగింది. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు ఊపు నివ్వడానికని.. నానితో తర్వాతి సినిమా అనే మాటను వినిపించేలా చూసుకొంటున్నాడు గౌతమ్.

ప్రస్తుత తరుణంలో కెరీర్ మీద ప్రేమ ఉన్న తెలుగు హీరోలెవరూ గౌతమ్ కు ఓకే చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా.. ఒకే కాన్సెప్టును.. మూడు నాలుగు భాషల్లో.. ఆయా భాషల హీరోలతో ఒకేసారి తెరకెక్కించాలన్న గౌతమ్ దురాశే.. ఈ పరిస్థితికి కారణం. 

Show comments