గంటా, అయ్యన్న.. మధ్యలో చంద్రబాబు.!

చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.. ఇద్దరూ విశాఖ జిల్లాకు చెందినవారే. ఇద్దరికీ రాజకీయంగా బోల్డంత పలుకుబడి వుంది. ఇద్దరూ మంత్రులే. ఈ ఇద్దరిలోకీ అయ్యన్నపాత్రుడు సీనియర్‌, పైగా ఫైర్‌ బ్రాండ్‌. గంటా శ్రీనివాసరావు విషయానికొస్తే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.

చాలా అవినీతి ఆరోపణలున్నాయి గంటా శ్రీనివాసరావు మీద. అయినాసరే, అధికారంలో ఎవరుంటే వారితో అత్యంత సన్నిహితంగా మెలగడం గంటా స్పెషాలిటీ. 

ఇక, అసలు విషయమేంటంటే విశాఖలో భూ కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం వుందన్నది మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణ.

గంటా పేరెత్తలేదుగానీ, పరోక్షంగా విశాఖ జిల్లాకే చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా అధికార పార్టీపై నిప్పులు చెరిగేశారు మొన్నామధ్య. ఈ వివాదం అటు తిరిగి, ఇటు తిరిగి ప్రభుతాన్ని డిఫెన్స్‌లో పడేసింది. 

గంటా - అయ్యన్న మధ్య మాటల యుద్ధం, మధ్యలో బీజేపీ ఎంట్రీ.. వెరసి, చంద్రబాబు వ్యూహాత్మకంగా 'సిట్‌'ని వేసేశారు. అయినా, రచ్చ ఆగలేదాయె. ఇక, ఇలా కాదనుకుని చంద్రబాబు, ఇద్దరినీ పిలిచి క్లాస్‌ తీసుకున్నారు.

గంటా - అయ్యన్నలతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరైన 'సమన్వయ కమిటీ సమావేశం' నుంచి ఆ ఇద్దరినీ బయటకు పంపి, మిగతా నేతల అభిప్రాయం తీసుకున్నారు. ఇంతలోనే అనూహ్య పరిణామం, 'గంటా శ్రీనివాసరావుకీ, నాకు మధ్య వివాదం లేదు.. మేమిద్దరం విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు బయటకు రావాలనే కోరుకున్నాం.. నేనేమీ గంటాపై ఆరోపణలు చేయలేదు..' అంటూ అయ్యన్న వివరణ ఇచ్చుకున్నారు.

తాను మాట్లాడాకే ముఖ్యమంత్రి 'సిట్‌' వేశారని తనకు తానే కిటాబిచ్చుకున్నారు అయ్యన్న. ఇంకోపక్క గంటా శ్రీనివాసరావు సైతం, అయ్యన్న వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ మొత్తం ఎపిసోడ్‌ చూస్తే, విశాఖ భూ కుంభకోణం ఓ ఇంటి వ్యవహారంలా చంద్రబాబు మీడియేట్‌ చేసేశారన్న అనుమానం కలుగుతోంది కదూ.! అయినా, చంద్రబాబుకి ఇవన్నీ అలవాటే. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి రవాణా శాఖ అధికారపై దాడికి వెళితే, చంద్రబాబు ఆ మేటర్‌నీ తేలిగ్గా డీల్‌ చేసేశారు. అక్కడ అధికారి ఆత్మగౌరవం బిక్కచచ్చిపోయినా, ముఖ్యమంత్రి లెక్కచేయలేదాయె. 

ఇక, విశాఖ భూ కుంభకోణం విషయానికొస్తే.. వందల కోట్లు, వేల కోట్లు ఈ కుంభకోణంలో కొల్లగొట్టబడిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. రాజకీయ ప్రముఖలకు సంబంధం లేకుండా ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతాయా.? పైగా, ఓ మంత్రి, ఇంకో మంత్రిపై ఆరోపణలు చేశాక.. చంద్రబాబెలా ఆ ఇద్దరికీ మధ్య మీడియేట్‌ చేస్తారు.? దటీజ్‌ చంద్రబాబు జమానా.!

Show comments