2019 ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నాడు ఒకప్పటి కమెడియన్, ఇప్పుడు బడా నిర్మాత అయిన బండ్ల గణేష్. ఓ పక్క టీఆర్‌ఎస్ పార్టీని లైన్‌లో పెడుతూనే, ఇంకోపక్క తన 'దేవుడు' పవన్‌కళ్యాణ్ పార్టీ జనసేన మీద కూడా కర్చీఫ్ వేసేశాడు. ఎందుకో ఈ మధ్య అంతగా పవన్‌తో బండ్ల గణేష్ కన్పించడంలేదు.. అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నేనెప్పుడూ పవన్‌తో టచ్‌లోనే వుంటా.. డైరెక్ట్‌గా ఆయన దగ్గరకు ఎప్పుడైనా వెళ్ళే స్వేచ్ఛ నాకుంది..' అని చెప్పుకొచ్చాడు.
జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందనీ, అధికారం కోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టలేదనీ, అధికారం కోసమే అయితే ఈ పాటికే పవన్, ఎన్నికల్లో పోటీ చేసి వుండేవాడని అంటున్నాడు బండ్ల గణేష్. ఏమో, కాలం కలిసొస్తే జనసేన పార్టీ నుంచే పోటీ చేస్తానేమో.. అని హింట్ కూడా ఇచ్చేశాడు. మరోపక్క, టీఆర్‌ఎస్‌తో టచ్‌లో వుంటోన్న బండ్ల గణేష్, 2019 ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే ఎంపీగా టిక్కెట్ తనకు దక్కుతుందనే ధీమాతో వున్నాడట.
ఇక, త్వరలో ఓ బిగ్ హీరోతో తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వుంటుందని బండ్ల గణేష్ చెబుతున్నాడు. పవన్‌కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడూ తనకు స్పెషల్‌గానే వుంటుందనీ, మంచి కథ దొరికితే పవన్‌ని ఎప్పుడైనా ఒప్పించగలననీ అంటున్నాడు బండ్ల గణేష్. మొత్తమ్మీద, సినీ నిర్మాణంలో ఈ మధ్య కాస్త వేగం తగ్గించిన బండ్ల గణేష్, మళ్ళీ నిర్మాతగా జూలు విదుల్చుతానంటుండడం విశేషమే. అదే సమయంలో, రాజకీయాల విషయంలోనూ ఖచ్చితమైన అవగాహనతో వున్నట్టున్నాడు. అయితే జనసేన, లేదంటే టీఆర్‌ఎస్.. బండ్ల గణేష్ పొలిటికల్ స్కెచ్ అదిరింది కదూ.!