అనుకున్నంతా అయ్యింది.. అడ్డగోలుగా పన్ను మినహాయింపు ఉత్తర్వులు ఇచ్చారంటూ కోర్టులో పిటిషన్ పడింది. బాలకృష్ణ... సీఎం చంద్రబాబుకు బామ్మర్ధి అయినందునే, వీళ్లిద్దరూ వియ్యంకులు అయినందునే.. ‘గౌతమి పుత్రశాతకర్ణి’ కి పన్ను మినహాయింపులను ఇచ్చారని, ఈ విషయంలో నిబంధనలను అతిక్రమించారని అంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాకు పన్ను మినహాయింపుపై ఇప్పటికే విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం పోటీలు పడి ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చాయి. ఆ సినిమాను ఎలా తీశారు? అందులో చరిత్రను వక్రీకరించారా? సరిగా చూపించారా? చూపించిందంతా నిజమేనా? అనే అంశాల గురించి క్లారిటీ లేకుండానే, తెలుగు పాలకుడి సినిమా అంటూ.. పన్ను మినహాయింపును ఇచ్చేశారు.
అసలు అంత భారీ బడ్జెట్ సినిమాకు పన్నుమినహాయింపును ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనే విజ్ఞతతో కూడా ఆలోచించినట్టుగా లేరు పాలకులు. దీంతో ఇప్పుడు పిటిషన్ వరకూ వచ్చింది వ్యవహారం. సినిమా రేపే విడుదల కానున్న నేపథ్యంలో పిటిషనర్ లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలని కోరగా.. కోర్టు స్వీకరించలేదు. సినిమా విడుదల అయ్యాకా కూడా మినహాయింపును పొందిన పన్నును వసూలు చేసే అవకాశం ఉంది కాబట్టి.. రెగ్యులర్ బెంచ్ కే వెళ్లాలని సూచించింది న్యాయస్థానం.